వాడవాడలా గ్రామగ్రామాన స్వతంత్ర వేడుకలు నిర్వహించాలి : సీఎం కేసీఆర్‌

65
hicc
- Advertisement -

ఎన్నో త్యాగాలు.. ఎన్నో పోరాటాలు..ఎన్నో ఆవేదనలతో కూడిన స్వాతంత్య్రం మనకు సిద్ధించింది.. ఆ స్ఫూర్తిని అందరికీ తెలిసేలా వాడవాడలా.. గ్రామగ్రామాన అద్భుతంగా స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు హెచ్‌ఐసీసీలో సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మొదట సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఎగుర వేసి, జెండా వందనం చేశారు. ఆ తర్వాత భరతమాత, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలవేశారు. అనంతరం జ్యోతిప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు కార్యక్రమాలు ఆహుతులను మంత్రముగ్ధులను చేశాయి. అనంతరం జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు.

స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ సేవలను కొనియాడారు. ‘అనేక త్యాగాలతో, అనేక పోరాటాలతో స్వాతంత్య్రాన్ని సముపార్జించి 75 సంవత్సరాలు స్వయంపాలనలో అప్రతిహాతంగా ముందుకుసాగుతున్న భారతావని. 75 సంవత్సరాలు రేపు రాబోయే 15వ తేదీకి పూర్తి చేసుకుంటుంది. సుదీర్ఘకాలం స్వయంపాలనలో సుసంపన్నమైన భారతదేశంలో తరాలు మారుతున్నాయ్‌. కొత్త తరాలు వస్తున్నాయ్‌. వారికి స్వాతంత్య్ర పోరాట సమయంలో జరిగిన సమరం, త్యాగాలు కొత్త తరానికి తెలియవు. ఎప్పటికప్పుడు సందర్భోచితంగా కొత్త తరం వారికి తెలియజేయడం పాతతరం వారి కర్తవ్యం, విధి’ అని అన్నారు.

ఏ దేశానికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఒక అపురూపమైన సందర్భమని సీఎం కేసీఆర్‌ అన్నారు. భారత స్వాతంత్య్రం కూడా సుదీర్ఘమైన పోరాటం. సుమారు రెండు శతాబ్దాల పాటు కొనసాగిన పోరాటం. అనేక మంది పెద్దలు, అనేక రకాల పద్ధతుల్లో వలస పాలకులకు వ్యతిరేకంగా అపురూపమైన త్యాగాలు చేస్తూ పోరాటాలు చేశారు. దాంట్లో ప్రధానంగా 1857 సిఫాయిల తిరుగుబాటును తీసుకుంటాం. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విశేషమేంటంటే.. సిఫాయిలు తిరుగుబాటు రాజ్యం పడిపోవాలి. విప్లవపంథాలో విప్లవాలు చెలరేగి.. విప్లవ శక్తులు విజయం సాధించిన వేళకూడా రాజ్యానికి సహకరించే సగం మంది విప్లవకారులతో కలిసినప్పుడే విజయం సాధిస్తుంది. అట్లాగే సాయుధ బలగాలు పోరాటం, తిరుగుబాటు చేస్తే రాజ్యంపోవాలే. కానీ, భారత స్వతంత్ర సమరంలోని ఉజ్వలఘట్టం ఆ నాటి బ్రిటిష్‌ వలస రాజ్యం కూలిపోలే. ఆ తర్వాత బలంగా అణచివేత ప్రారంభించారు. అయినా స్వతంత్ర ఉద్యమకారులు సిపాయిల తిరుగుబాటు లాంటి అరూపఘట్టమే ఫెయిల్‌ అయ్యిందని ఎనూడు నిరాశ చెందలే. అదే స్ఫూర్తితో వైఫల్యాన్ని పాఠంగా నేర్చుకొని పోరాటాన్ని కొనసాగించారు. బాలగంగాధర్‌ తిలక్‌ నేతృత్వంలో అనేక సాంస్కృతిక పోరాటాలు వచ్చాయి. లాలాలజపతిరాయ్‌, బిపిన్‌చంద్రపాల్‌ ఇలా అనేక మంది పోరాటాలు చేశారు. ఝాన్సీ లక్ష్మీభాయి, ఎంతో మంది రాజులు, సంస్థానాదీశులు యావత్‌ ఆసేతుహిమాచలం ఒకటై పోరాటం జరిపారు అని సీఎం కేసీఆర్‌ కొనియాడారు..

మనం ఎంతో గర్వంగా, సంతోషంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహాత్మాగాంధీ వారసులుగా ఈ దేశ భవిష్యత్‌ను తీర్చిదిద్దడానికి కంకణంకట్టుకున్న వ్యక్తులుగా మనం ప్రజాసేవ రంగంలో మునిగి ఉన్నాం. మీ అందరికీ శ్రమ ఇచ్చి రాష్ట్రం నలుమూల నుంచి పిలిపించిన కారణం ఏంటంటే.. ఒక మహోజ్వలమైనటువంటి స్వతంత్ర వజ్రోత్సవ దీప్తి.. వాడ వాడల గ్రామగ్రామాన చాలా అద్భుతంగా జరగాలి. చాలా గొప్పగా ఎన్ని త్యాగాలతో, ఎన్ని రకాల పోరాటాలతో, వేదనలు.. ఆవేదనలతో స్వాతంత్య్రం వచ్చిందో ప్రతిగడపకు తెలిసేలా నిర్వహించాలి. జిల్లాలో మంత్రుల ఆధ్వర్యంలో కమిటీలు ఉన్నయ్‌.

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ అధ్యక్షులు, మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, ఎంపీపీలు అందరు తమ పరిధిలో వివిధ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆనాటి స్ఫూర్తిని ఈ వేదికగా మీరు పొంది తిరిగి మీ మీ గ్రామాలు, పట్టణాల్లో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు రప్పించమని మనవి చేస్తున్నమన్నారు. ఏయే సందర్భంలో ఎవరు త్యాగాలు చేశారు, ఎన్ని రకాల పోరాటాలు చేశారు.. అలవోకగా తమ అసువులు, ఆయుష్షును దేశ స్వాతంత్య్రం కోసం ధారబోశారు.. మరణానికి వెనుకాడకుండా.. మడమ తిప్పకుండా పోరాటాలు చేశారు.. అలాంటి స్ఫూర్తి, త్యాగనీరతిని మనం ప్రతి గడపకూ వారి పోరాట ఫలితాలు, విశేషాలను ప్రతి మనిషికి తెలపాలని సూచించారు.

- Advertisement -