తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన రైతు సదస్సు జరుగనుంది. ప్రగతి భవన్ వేదికగా జరుగనున్న సదస్సులో 25 రాష్ట్రాల రైతు సంఘాల నేతలు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వ్యవసాయరంగంలో నెలకొన్న పరిస్థితులతో పాటు.. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై చర్చించనున్నారు. తెలంగాణ ప్రగతిపై రూపొందించిన డాక్యుమెంటరీని తిలకించనున్నారు. అనంతరం రైతు సంఘాల నేతలతో కలిసి సీఎం కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేయనున్నారు. లంచ్ అనంతరం సదస్సు తిరిగి కొనసాగుతుంది.
తెలంగాణలో జరుగుతున్న వ్యవసాయ, సాగునీటి రంగ అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధ్యయనం చేసేందుకు ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, పంజాబ్, జార్ఖండ్, ఒడిశా సహా 25 రాష్ట్రాలకు చెందిన వందమందికి పైగా రైతుసంఘాల నాయకులు, ప్రతినిధులు శుక్రవారం రాష్ట్రానికి చేరుకున్నారు. తెలంగాణ అమలు చేస్తున్న వ్యవసాయ విధానాలను స్వయంగా చూసేందుకు వారు వచ్చారు. నగరంలోని హోటల్ టూరిజం ప్లాజాలో బస చేసిన రైతు ప్రతినిధుల బృందం.. మూడు రోజులపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నది. శుక్రవారం సిద్దిపేట జిల్లాలో క్షేత్రస్థాయి పరిశీలనను వారు ప్రారంభించారు. మల్లన్నసాగర్, సింగాయపల్లిల్లో పర్యటించిన రైతు ప్రతినిధులు.. తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని అభిప్రాయపడ్డారు. ఇక్కడి రైతు సంక్షేమ, వ్యవసాయ, అభివృద్ధి విధానాలను తమ రాష్ట్రాల్లోనూ అమలు చేసేలా అక్కడి ప్రభుత్వాలను డిమాండ్ చేస్తామని వారు పేర్కొన్నారు.