దిల్లీలో ఆదివారం జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బహిష్కరిస్తున్నానని సీఎం కేసీఆర్ తెలిపారు. చాలా బాధకరమే అయినప్పటికీ ప్రజాస్వామ్య దేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల నిరసన తెలియజేయడానికి ఇదే ఉత్తమమైన మార్గంగా భావించినట్టు చెప్పారు. తమ నిరసనను బహిరంగ లేఖ ద్వారా నేరుగా ప్రధానికి తెలియజేస్తున్నామని వెల్లడించారు.
స్వాతంత్ర్య పోరాటం జరిగే సమయంలోనే… స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఎలా చేయాలి? అనే దానిపై చర్చలు జరిగాయి. స్వాతంత్ర్య భారతవని ఎలా ఉండాలనేదానిపై జరిగిన చర్చోపచర్చల ఫలితంగానే ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. దీని ద్వారా ప్రణాళికలు రూపకల్పన చేసి కేంద్రం ఎలా వ్యవహరించాలి? రాష్ట్రం ఎలా వ్యవహరించాలనేది నిర్ణయించారు. వార్షిక ప్రణాళికలు ఉండాలి, పంచవర్ష ప్రణాళికలు ఉండాలి…వాటిని అనుసరించి విజన్ ఉండాలని ఆలోచనలు జరిగాయి. నెహ్రూ ప్రధాని అయిన తర్వాత ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అమల్లోకి వచ్చింది. భారత ప్రణాళిక సంఘం అంటే ఎంతో పేరు ప్రఖ్యతులు ఉండేవి. ఎందరో మహానుభావులు అందులో సభ్యులుగా ఉన్నారు. దేశానికి అవసరమైన కీలక నిర్ణయాలు ప్రణాళిక సంఘం తీసుకునేదని సీం కేసీఆర్ తెలిపారు.
ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా రద్ధు చేసి దానికి ప్రత్యామ్నాయంగా నీతి ఆయోగ్ తీసుకొచ్చారు. నీతి ఆయోగ్‌ను టీమ్ ఇండియా అని పిలుస్తామని ప్రధాని మోదీ చెప్పారు. నీతి ఆయోగ్ ద్వారా సహకార సమాఖ్య విధానాన్ని పాటిస్తారని భావించాం. దేశానికి మంచిరోజులు వస్తాయని ఆశించాం. కానీ దురదృష్టవశాత్తూ నిరర్థక సంస్థగా మారిందన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 13 నెలల పాటు రైతులు ఆందోళన చేశారు. చివరకు నల్ల చట్టాలు రద్దు చేసి ప్రధాని స్వయంగా ప్రజలకు క్షమాపణ చెప్పారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. ఆదాయం రెట్టింపు కాకపోగా ఖర్చులు రెట్టింపయ్యాయి. దేశంలో సాగుకు నీరు దొరకట్లేదు. విద్యుత్ లేదు. బీజేపీ 8 ఏళ్ల పాలనలో ఏం అభివృద్ధి జరిగింది? దేశ రాజధానిలో కూడా తాగడానికి మంచినీళ్లు లేవన్నారు.
దేశంలో నిరుద్యోగ సమస్య నానాటికీ పెరిగిపోతుంది. దేశం నుంచి రూ. లక్షల కోట్ల పెట్టుబడులు తరలిపోతున్నాయి. దాదాపు 16 రాష్ట్రాల నుంచి ఉపాధి హామీ కూలీలు దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసే పరిస్థితి ఏర్పడింది. అదుపు లేకుండాపోతున్న ద్రవ్యోల్భణం, జీడీపీ పతనం పెరుగుతున్న నిత్యావసర ధరలు అంతులేకుండా పెరుగుతున్నాయన్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఎందుకు పతనమవుతోందో చేప్పడంలేదన్నారు. దేశంలో పరిస్థితి చూస్తుంటే నీతి ఆయోగ్ ఏం ఒరగబెట్టింది. నీతి ఆయోగ్ సిఫార్స్ లను కూడా గౌరవించడం లేదు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. కానీ కేంద్రం పట్టించుకోలేదని సీఎం కేసీఆర్ వివరించారు.