ఈ ఏడాది రబీలో ఇప్పటి వరకు 6 లక్షల మంది రైతుల నుండి 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇంకా మూడు నుంచి ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందనే అంచనా వేస్తున్నామన్నారు. చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకొని కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలిరచడం జరుగుతోందని ఇప్పటివరకు 34.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తరలించడం జరిగిందని తెలిపారు. ధాన్యం కొనుగోలు, చెల్లింపులకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ యాసంగి సీజన్ ప్రారంభానికి ముందే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు పౌరసరఫరాల యంత్రాంగం కూడా క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పనిచేస్తోందన్నారు.
కనీస మద్దతు ధర చెల్లింపులకు సంబంధించి పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చామని, ఆన్‌లైన్‌లో ట్రక్ షీట్ జనరేట్ అయిన వెంటనే రైతు ఖాతాల్లోకి నేరుగా నిధులను జమ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 6,17,189 మంది రైతుల నుండి 35.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, ఇందుకు సంబంధించి ట్రక్ షీట్ జనరేట్ అయిన ధాన్యానికి నిధులను విడుదల చేయడం జరిగింది. ధాన్యం కొనుగోలు, చెల్లింపులు, కొనుగోలు కేంద్రాల సమాచారాన్ని రైతులకు సెల్‌ఫోన్ ద్వారా అందించడం, మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు, కనీస మద్దతు ధర చెల్లింపులకు వంటి అంశాల్లో రైతులకు మరింత ప్రయోజనం చేకూరేలా ఆన్‌లైన్ ప్రొక్యూర్‌మెంట్ మేనేజ్‌మెంట్ సిస్టం (ఓపీఎంఎస్)ను పౌరసరఫరాల శాఖ మరింత అభివృద్ధి చేసింది.
ఈ సాఫ్ట్‌వేర్ ఈ యాసంగితోనే ప్రారంభం కావడంతో అక్కడక్కడ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ధాన్యం కొనుగోలు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియలో ఆలస్యం జరగడంతో చెల్లింపుల్లో కూడా కొంత జాప్యం జరుగుతోందని మంత్రి అన్నారు. ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా రైతులకు అందుబాటులో ఉండే విధంగా 3520 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను కేంద్రం నిర్వాహకులు ట్యాబ్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసి జిల్లా కార్యాలయానికి, అక్కడి నుండి కేంద్ర కార్యాలయానికి పంపిస్తారు.కేంద్ర కార్యాలయం ఆమోదం తెలిపిన వెంటనే డబ్బులు నేరుగా రైతు ఖాతాల్లోకి జమ అవుతాయి.
చెల్లింపుల్లో ఎలాంటి జాప్యానికి ఆస్కారం లేకుండా సాంకేతిక సమస్యలను అధిగమించి వచ్చే పది ప్రభుత్వ పనిదినాల్లో వందశాతం నిధులను రైతు ఖాతాల్లోకి జమ చేసేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ను ఆదేశించడం జరిగింది. యాసంగిలో ధాన్యం కొనుగోలుకు రూ. 7000 కోట్లు అవసరం అవుతాయని, రైతులకు చెల్లించేందుకు ప్రభుత్వం దగ్గర సరిపడినన్ని నిధులు ఉన్నాయని, ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు.