త్వరలో సీఐసీ పోస్టు భర్తీ.. సుప్రీంకోర్టులో విచారణ..

110
- Advertisement -

చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ నియామకానికి కసరత్తు మొదలైంది. ప్రస్తుతం ఉన్న ఖాళీని భర్తీ చేసేందుకు సంబంధించిన దస్త్రం సీఎంఓకు చేరింది. సీఐసీ నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ కోనసాగుతోంది. వచ్చేనెల బెంచిపైకి రానుంది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువడగానే ప్రభుత్వం చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పోస్టును భర్తీ చేయనుంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అసెంబ్లీ కార్యదర్శిగా 2017 సెప్టెంబర్లో పదవీ విరమణ పొందిన రాజా సదారాంను ప్రభుత్వం చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా నియమించింది. ఆగస్టు 2020లో ఆయన సీఐసీగా పదవీ విరమణ చేశారు. అప్పటికే ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా ఉన్న బుద్దా మురళికి ప్రభుత్వం ఇంఛార్జిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి బుద్దా మురళి ఆ విధుల్లో కొనసాగుతున్నారు. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న రాజ్యాంగపర పదవులను భర్తీ చేయాలంటూ అంజలి భరద్వాజ్ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. రాష్ట్రంలో నలుగురు సమాచార కమిషనర్లను నియమించాలంటూ 2019లో అత్యున్నత న్యాయస్థానం జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ ఆదేశాల అనుసారం ఫిబ్రవరి 2020లో ప్రభుత్వం మొత్తం ఐదుగురిని సమాచార కమిషనర్లుగా నియమించింది.

ఫిబ్రవరి నెలలో కట్టా శేఖర్ రెడ్డి, మైదా నారాయణ రెడ్డి, గుగులోత్ శంకర్ నాయక్, డా. ఎండీ అమీర్, ఖలీలుల్లాల నియామక ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణలో రాజ్యాంగ పదవుల నియామకాల వివరాలు తెలియజేయాలని 2019లోనే దాఖలైన మిసెలీనియస్ పిటిషన్ నెంబర్ 1979ని కూడా అపెక్స్ కోర్టు విచారించింది. సంబంధిత సమాచారమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బదులుగా 5 గురు ఇన్ఫర్మేషన్ కమిషనర్లను నియమిస్తూ ఫిబ్రవరి 10వ తేదీన జారీ చేసిన జీవోతో పాటు ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇదే సమయంలో ఖాళీగా ఉన్న చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పోస్టు సమాచారాన్ని క్రోడీకరించింది. సీఐసీ నియామకానికి సంబంధించిన పిటిషన్ జనవరి 3వ తేదీన సుప్రీం బెంచి ముందుకు రానుంది. ఆ తరవాత వెలువడే ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పోస్టు నియామకం కోసం పేపర్ ప్రకటన ద్వారా నోటిఫికేషన్ జారీ చేయనుంది.

అటు ప్రస్తుత ఇంఛార్జి చీఫ్ కమిషనర్ తో పాటు, మిగిలిన ఇన్ఫర్మేషన్ కమిషనర్లందరి పదవీకాలం 2023 ఫిబ్రవరితో ముగుస్తుంది. దీంతో 2022 నవంబర్లోనే ఈ పదవులన్నిటి నియామకం కోసం ప్రభుత్వం పేపర్ ప్రకటన ద్వారా దరఖాస్తులు ఆహ్వానించాల్సి ఉంటుంది. తరవాత ఆ పోస్టుల భర్తీ ప్రక్రియను మొదలు పెడుతుంది.

- Advertisement -