ప్రస్తుత వర్షాకాల సీజన్లో నేటి వరకు 27,64,744 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేశారని,ఆగష్టు మాసంలో సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాల నేపధ్యంలో పంటల సాగు సాధారణ స్థితికి చేరుకుంటుందనే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి ఆశాభావం వ్యక్తం చేశారు.గురువారం సచివాలయంలో వాతావరణ పరిస్థితులు, పంటల పరిస్థితి, రైతు భీమాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షించారు.
ప్రస్తుత వర్షాకాల సీజన్ లో జూన్, జూలై 24 నాటికి సాధారణ వర్షపాతం 317.2 మిల్లీమీటర్లు కాగా ప్రస్తుత సీజన్లో 200.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని. ఆగష్టులో మంచి వర్షపాతం నమోదు అవుతుందని IMD అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి వివరించారు. 5 జిల్లాలలో సాధారణ వర్షపాతం నమోదు అయ్యిందని, మిగతా జిల్లాలలో వర్షపాతం తక్కువగా నమోదు అయ్యిందని అన్నారు. వివిధ జిల్లాలలో పంటల సాగు మొత్తం ఖరీఫ్ సీజన్ సాధారణ విస్తీర్ణంలో 64 శాతం వరకు చేరుకుందని, నేటి వరకు (జూలై 25 నాటికి) సాధారణ విస్తీర్ణంలో 90 శాతం వరకు పంటలు సాగయ్యాయని, వరి మినహా మిగతా పంటల సాగు ప్రస్తుతం సంతృప్తికరంగా ఉందని అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి వివరించారు.
వివిధ పంటల ప్రస్తుత పరిస్థితిని వివరించారు. ఆగష్టులో సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయన్న అంచనాల మేరకు, వరి విస్తీర్ణం సాధారణానికి చేరుకుంటుందని అన్నారు. ప్రధాన నీటి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ సరియైన ఇన్ ఫ్లో లు లేవని, నీటి మట్టం పెరుగుతాయని వరి రైతులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. వాతావరణ పరిస్థితులు,పంటల సాగు పై ఆగష్టు 13న మరోమారు సమావేశమై పరిస్థితిని సమీక్షించాలని సి.యస్ నిర్ణయించారు. విత్తనాలు,ఎరువుల లభ్యతపై సమీక్షించారు. గత 10 సంవత్సరాలకు సంబంధించి నెలవారిగా, పంటల వారిగా విస్తీర్ణం వివరాలను జిల్లాల వారిగా సమర్పించాలన్నారు. రిజర్వాయర్లలో నీటి మట్టాల పరిస్థితిని సమీక్షించారు. భూగర్భ జలాలకు సంబంధించి మండలాల వారిగా గత 10 సం.లకు సంబంధించిన నివేదికను క్యాటగిరీలుగా విభజించి సమర్పించాలన్నారు.
రైతు భీమాపై సమీక్ష.. రాష్ట్రంలో రైతు భీమా పథకం గడువు ఆగష్టు 14, 2018 న ప్రారంభమై 13-08-2019న ముగుస్తుందని, 30.92 లక్షల మంది రైతులు భీమా పథకంలో నమోదు చేసుకున్నారని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్ధసారథి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి వివరించారు. గురువారం సచివాలయంలో రైతు భీమాపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవసాయ, LIC అధికారులతో సమావేశమయ్యారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు మరణించిన 14705 మంది రైతులకు 5 లక్షల చొప్పున 735.25 కోట్లు చెల్లించినట్లు మరికొన్ని కేసులకు సంబంధించి ప్రాసెసHలో ఉన్నాయని సి.యస్కు తెలిపారు. భీమాకు సంబంధించి రైతుకు 2271.50 రూ.ల చొప్పున 704.16 కోట్లు LIC కి చెల్లించామని, రైతులు మరణించిన వెంటనే భీమా పరిహారం సత్వరం అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
ఈ సందర్భంగా LIC అధికారులు మాట్లాడుతూ.. తమది ప్రభుత్వ సంస్థని, లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్నామని, లబ్దిదారులకు చెల్లించిన పరిహారానికి అనుగుణంగా వాస్తవ ఖర్చు మేరకు ప్రీమియంను ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై సి.యస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకువెళ్లి, వారి ఆమోదంతో వచ్చే సంవత్సరానికి రెన్యూవల్ చేస్తామన్నారు.
ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామ కృష్ణారావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి, వ్యవసాయ శాఖ కమీషనర్ రాహుల్ బొజ్జ , IMD డైరెక్టర్ వై.కె.రెడ్డి లతో పాటు, గ్రౌండ్ వాటర్, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.