తెలంగాణలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం కరోనా కట్టడికి తగు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీబీఎస్‌ఈ పరీక్షలు రద్దయ్యాయి. ఇదే తరుణంలో రాష్ట్రంలో కూడా పరీక్షలను రద్దు చేసేందుకే ప్రభుత్వం మొగ్గు చూపింది. ఇక ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ విషయానికి సంబంధించిన ఫైల్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విద్యాశాఖ మంత్రి పంపించారు. ఈ ఫైల్‌పై ముఖ్యమంత్రి సంతకం చేసినట్లు సమాచారం.
రాష్ట్రంలో 5 లక్షల 35 వేల మంది టెన్త్ విద్యార్థులు ఉన్నారు. కాగా, వీరందరినీ పైతరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు 4 లక్షల 58 వేల మంది ఉన్నారు. కరోనా ఉధృతి తగ్గాక వీరికి పరీక్ష నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇది వరకే ప్రకటించిన ప్రవేశ పరీక్షల తేదీలు పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.