కొత్త మంత్రులు..బయోగ్రఫీ

274
- Advertisement -

1.తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో చోటుదక్కించుకున్న వారిలో సీఎం కేసీఆర్‌ సన్నిహితుల్లో ఒకరు వేముల ప్రశాంత్‌ రెడ్డి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం నుంచి 2014,2018 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం వైస్ చైర్మెన్ గా వేముల ప్రశాంత్ రెడ్డి పని చేశారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రశాంత్‌రెడ్డి తండ్రి దివంగత వేముల సురేందర్‌రెడ్డి చురుగ్గా పనిచేశారు. కేసీఆర్‌కు దగ్గరగా ఉన్న సురేందర్ రెడ్డి టీఆర్ఎస్‌ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడి బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రశాంత్ రెడ్డి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించారు. పనితనం,విధేయత ప్రామాణికంగా ఆయనకు మంత్రి పదవి లభించింది.

santhosh errabelli

కేసీఆర్ వెంటే ఉంటూ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఇటీవల ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు నేపథ్యంలో కేసీఆర్‌ వివిధ రాష్ట్రాల పర్యటనకు వెళ్లిన సందర్భంలోనూ ఆయన వెంటే ఉన్నారు. ఇక ఎర్రవెల్లిలో కేసీఆర్‌ నిర్వహించిన మహారుద్ర చండీయాగంలోనూ ప్రశాంత్‌ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. తాజాగా ఈ నెల 14న విశాఖపట్నంలోని శారదా పీఠంలో జరిగిన అమ్మవారి పూజలకు కేసీఆర్‌ను పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆహ్వానించిన విషయం తెలిసిందే. అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయిన ముఖ్యమంత్రి, ఆయన స్థానంలో ప్రశాంత్‌రెడ్డిని పంపారు.

2.తెలంగాణ కేబినెట్ విస్తరణలో విధేయత,నమ్మకస్తులకు పెద్దపీట వేశారు సీఎం కేసీఆర్. తొలి నుండి కేసీఆర్ వెంటే ఆయన్నే నమ్ముకున్న శ్రీనివాస్‌ గౌడ్‌గా మంత్రివర్గ విస్తరణలో స్ధానం లభించింది. మునిసిపల్ కమిషనర్ నుండి మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు.

santhosh jagadeeshreddy

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మునిసిపల్ ఉద్యోగిగా, పలు పురపాలక సంఘాల కమిషనర్ గా, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ విధులు నిర్వర్తించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా టి జెఏసి కో చైర్మన్ గా పనిచేశారు.

కేసీఆర్ సూచన మేరకు తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి, రాజకీయాల్లోకి వచ్చి,2014లో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. శ్రీనివాస్ గౌడ్ ను పార్లమెంటరీ సెక్రటరీగా సీఎం కేసీఆర్ నియమించగా, కోర్టు తీర్పుతో ఆ పదవి రద్దయ్యింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసి శ్రీనివాస్ గౌడ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. వరుసగా రెండు సార్లు గెలుపొందిన శ్రీనివాస్ గౌడ్ కు ఈ సారి మంత్రి వర్గంలో చోటు కల్పించారు కేసీఆర్.

3.మంత్రివర్గ విస్తరణలో కొత్తవారికి ప్రాధాన్యం కల్పించారు సీఎం కేసీఆర్. వీరిలో తొలిసారే గెలిచి అమాత్యులుగా ప్రమాణస్వీకారం చేసే వారిలో నిరంజన్ రెడ్డి ఒకరు.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ప్రముఖ అడ్వకేట్ గా పేరున్న నిరంజన్ రెడ్డి 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు.

టీఆర్ఎస్ లో వివిధ బాధ్యతలు నిర్వహించిన నిరంజన్ రెడ్డి పార్టీ మేనిఫెస్టో కమిటీ సభ్యుడిగా పని చేశారు. 2014 ఎన్నికల్లో వనపర్తి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన నిరంజన్ రెడ్డి ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ నిరంజన్‌ రెడ్డికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి పదవి అప్పజెప్పి తగిన స్థానం కల్పించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి నుంచి పోటీచేసిన ఆయన 51 వేల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డిపై విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రి పదవి లభించిన ఎమ్మెల్యేల్లో నిరంజన్ రెడ్డి ఒకరు.

4.కేసీఆర్ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న వారిలో ఎస్సీ వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఈయన బీఏ చదువుకున్నారు. 26 ఏళ్లపాటు సింగరేణిలో ఉద్యోగం చేశారు. 1994లో ఉమ్మడి వరంగల్ జిల్లా మేడారం నియోజవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

2001లో టీఆర్ఎస్ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత జరిగిన ప్రతీ ఎన్నికల్లోనూ విజయం సాధించి డబుల్ హ్యాట్రిక్ కొట్టారు.

తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2008లో ఎమ్మెలే పదవికి కొ్ప్పుల ఈశ్వర్ రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పై విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజనతో కరీంనగర్ జిల్లా ధర్మపురి ఎస్సీ నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2014, 2018 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. డబుల్ హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యేల్లో ఒకరైన కొప్పుల ఈశ్వర్ కేసీఆర్ నమ్మిన వ్యక్తుల్లో ఒకరు. తెలంగాణ తొలి ప్రభుత్వంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా పనిచేశారు.

santhosh prashanth reddy

5.తెలంగాణ మంత్రివర్గంలో స్ధానం సంపాదించుకున్న వారిలో ఒకరు సీనియర్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో జగన్నాథరావు, ఆదిలక్ష్మి దంపతులకు 1956 జులై 4న జన్మించారు. ఇంటర్‌ వరకు చదువుకున్న ఎర్రబెల్లి విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో ఆసక్తికనబర్చారు. రేషన్‌ డీలర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఎర్రబెల్లి 1982లో టీడీపీలో చేరారు. సొసైటీ ఛైర్మన్‌గా,డీసీసీబీ చైర్మన్‌గా,ఎమ్మెల్యేగా,ప్రభుత్వ విప్‌గా,ఎంపీగా అంచెలంచెలుగా ఎదిగారు. 1

983లో తొలిసారి ఎన్నికల్లో పోటీచేసిన ఆయన ఓటమిపాలయ్యారు. తర్వాత 1994లో వర్దన్నపేట నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన తర్వాత జరిగిన ప్రతీ ఎన్నికల్లో విజయం సాధించారు. వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి డబుల్ హ్యాట్రిక్ కొట్టారు. మూడుసార్లు వర్దన్నపేట,మూడు సార్లు పాలకుర్తి నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2008 జూన్‌లో వరంగల్‌ పార్లమెంటు ఉప ఎన్నికల్లో గెలుపొంది లోక్‌సభలో అడుగుపెట్టారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.డబుల్ హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యేల్లో ఎర్రబెల్లి ఒకరు.

6.రంగారెడ్డి జిల్లాకు చెందిన వ్యాపారవేత్త చామకూర మల్లారెడ్డి. సరిగ్గా ఐదేళ్ల కిందట ఆయన పెద్దగా ఎవరికీ తెలియదు.తెలిసినా విద్యాసంస్థల అధినేతగానే పరిచయం. కానీ 2014లో ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో కీలకంగా మారారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదనడానికి ఉదహరణే మల్లారెడ్డి. ఎంతోమంది రాజకీయ దిగ్గజాలు ఉన్న ఇప్పుడు ఆయనకే మంత్రివర్గంలో అవకాశం దక్కింది.

డిగ్రీ డిస్ కంటిన్యూ చేసిన మల్లారెడ్డి తన పేరిట పలు విద్యా సంస్థలను నెలకొల్పారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి గా పోటీ చేసి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ తరపున విజయం సాధించిన ఏకైక ఎంపీ మల్లారెడ్డి. సీఎం కేసీఆర్ ప్రజాకర్షక పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్‌లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ అసెంబ్లీ స్థానం నుండి పోటీచేసి 80వేల మెజార్టీతో గెలుపొందారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే మల్లారెడ్డికి మంత్రి పదవి లభించింది.

7.గ్రేటర్ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్ధానాన్ని సంపాదించుకున్న నాయకుల్లో ఒకరు తలసాని శ్రీనివాస్ యాదవ్. మాస్‌ లీడర్‌గా మంచిపట్టున్న తలసాని ముచ్చటగా నాలుగోసారి మంత్రిపదవిని చేపట్టారు.

టీడీపీలో రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన అంచెలంచెలుగా మంత్రిస్ధాయికి ఎదిగారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన తలసాని మూడు సార్లు మంత్రిగా పనిచేశారు. 2014లో సనత్‌ నగర్‌ నుండి టీడీపీ తరపున గెలిచిన ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రిపదవిని చేపట్టారు. తాజాగా 2018లో సనత్‌ నగర్‌ నుండే భారీ మెజార్టీతో గెలిచి మరోసారి కేసీఆర్ కేబినెట్‌లో చోటుదక్కించుకున్నారు.

ఇప్పటికే కేసీఆర్ మంత్రి వర్గంలో గ్రేటర్ నుంచి హోంమంత్రిగా మహమూద్ అలీ ఉండగా తాజా మంత్రి వర్గ విస్తరణతో తలసానికి చోటు లభించడంతో మంత్రుల సంఖ్య రెండుకు చేరింది. ఇటు రాజకీయాల్లో అటు ప్రభుత్వ పాలనలో తలసాని తనదైన ముద్ర వేసుకున్నారు. కేసీఆర్ ఇచ్చిన బాధ్యతల్ని వమ్ము చేయకుండా అటు నగర టీఆర్‌ఎస్ బలోపేతం పాటు ఇటు అభివృద్ధిలో కీలకపాత్ర చేశారు. మత్స్య, పశు సంవర్థక శాఖ, సినీమాటోగ్రఫీ శాఖ మంత్రిగా తలసాని తనదైన శైలిలో పాలన అందించారు.

8.బీసీ నేతగా కేసీఆర్‌కు అత్యంత నమ్మకస్తుల్లో ఒకరు ఈటల రాజేందర్‌. 2002లో టీఆర్ఎస్‌లో చేరిన ఈటల 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కమలాపూర్‌ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 2008,2009,2010,2014,2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా డబుల్ హ్యాట్రిక్ కొట్టారు. ఓటమి ఎరుగని నేగా పేరు తెచ్చుకున్న ఈటల ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోనే కాదు, బంగారు తెలంగాణ నిర్మాణంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు.

santhosh koppula

2014లో టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో కీలకమైన ఆర్థికశాఖను ఈటలకు కేటాయించారు కేసీఆర్. ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకంగా ఉంటూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అన్నింటా అండగా నిలిచారు. నాటి నుంచి నేటివరకు తన రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ అధినేత వెంటే నడిచిన ఈటల.. నాడు ఉద్యమ సమయంలో పార్టీకి జిల్లాలో పెద్ద అండగా నిలిచారు.

పరిస్థితులు ఎలా ఉన్నా.. అధినేతకు నమ్మిన బంటుగా ఉన్నారు. ఆర్థిక, పౌరసరఫరాల శాఖలను సమర్థవంతంగా నిర్వహించిన ఆయనకు, మరోసారి మంత్రివర్గంలో చోటు దక్కింది.

9.ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి రెండోసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు గుంటకండ్ల జగదీష్‌రెడ్డి. సీఎం కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యం,ఉద్యమ నేపథ్యం ఆయనకు మరోసారి కేబినెట్‌లో చోటు దక్కేలా చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని టీఆర్‌ఎస్ నాయకులను సమన్వయం చేస్తూ పలు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించిన ఘనత ఆయన సొంతం.

2001 నుండి కేసీఆర్ వెన్నంటే నడిచారు. 2014 రాష్ట్ర ఆవిర్భావంతో పాటే ఏర్పాటైన తెలంగాణ తొలి కేబినెట్‌లో పూర్తికాలం ప్రాతినిధ్యం వహించిన జగదీష్‌రెడ్డికే రెండో కేబినెట్‌లోనూ సీఎం కేసీఆర్ మళ్లీ అవకాశం కల్పించారు. గత ప్రభుత్వంలో తొలుత విద్యాశాఖ, ఆ తర్వాత విద్యుత్ శాఖతోపాటు ఎస్సీ కులాల అభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు.

సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రానికి చెందిన గుంటకండ్ల జగదీష్‌రెడ్డి.. బీఏ, బీఎల్ పూర్తి చేసి కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అధికార ప్రతినిధి, పొలిట్ బ్యూరో సభ్యుడిగా పని చేశారు. 2009లో హుజూర్‌నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయినా 2014, 2018 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు సూర్యాపేట నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

2013లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్‌చార్జీగా బాధ్యతలు అందుకొని గత ఎన్నికల్లో ఆరు స్థానాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన జగదీష్‌రెడ్డి.. తాజాగా గత డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు 9స్థానాల్లో గెలిచే విధంగా వ్యూహాత్మక అడుగులు వేశారు.

10.కేసీఆర్ కేబినెట్‌లో రెండోసారి స్థానం దక్కించుకున్న వారిలో ఒకరు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. అనుభవం, పనితీరుతో పాటు వివాద రహితునిగా పేరున్న అల్లోలను మంత్రివర్గంలో తీసుకున్నారు కేసీఆర్.

1969లో విద్యార్థిదశలో కళాశాలల్లో జరిగిన ఎన్నికల్లో చురుగ్గా పాల్గొన్న ఇంద్రకరణ్ రాజకీయంగా ఎన్నో పదవులను అలంకరించారు.న్నారు. టీచర్‌గా కొద్దికాలం పనిచేసిన ఆయన టీడీపీ ఆవిర్భావం తర్వాతా ఆ పార్టీలో చేరి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్‌గా పనిచేశారు. 1987లో జడ్పీఛైర్మన్‌గా 1991లో ఆదిలాబాద్‌ ఎంపీగా గెలుపొందారు.1996, 1998 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. 1999, 2004లో జరిగిన నిర్మల్‌ శాసనసభ స్థానం నుంచి గెలుపొందారు. 2008లో జరిగిన పార్లమెంటు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఎంపీగా గెలుపొందారు. 2014లో బీఎస్పీ నుంచి పోటీచేసి గెలుపొందిన ఆయన తర్వాత టీఆర్ఎస్‌లో చేరి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2018 ఎన్నికల్లోనూ నిర్మల్‌ నుండే భారీ మెజార్టీతో గెలుపొందారు.

రాష్ట్ర దేవాదాయ, గృహనిర్మాణ, న్యాయశాఖ మంత్రిగా అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. దేవాదాయశాఖ మంత్రిగా రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి భారీ మొత్తంలో నిధులు మంజూరు చేయిండచం, పురాతన ఆలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.

- Advertisement -