Revanth:18న కేబినెట్ భేటీ

19
- Advertisement -

జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పునర్విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల కేటాయింపు మొదలు ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన పెండింగ్ అంశాలన్నింటిపై నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. షెడ్యూలు 9, షెడ్యూలు 10 లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించిన పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. పలు అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. విద్యుత్తు సంస్థల బకాయిలు ఇంకా తేలలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలను ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు.

రెండు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకునేందుకు వీలున్న ఉద్యోగుల బదిలీల వంటి అంశాలు పూర్తి చేయాలని ఆదేశించారు. రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరిన వాటిని పరిష్కరించుకోవాలని, పీటముడి పడిన అంశాలపై తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా తదుపరి కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు.

పదేండ్లు పూర్తవనుండటంతో పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ కేవలం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మారనుంది. ఈ పదేండ్ల కాలానికి ఏపీకి కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ వంటి భవనాలను జూన్ 2 తర్వాత రాష్ట్ర అధీనంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
పునర్విభజన చట్ట ప్రకారం పెండింగ్లో ఉన్న అంశాలు, ఇప్పటివరకు రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయంతో పంపిణీ చేసుకున్న వివరాలపై సమగ్రమైన నివేదికను తయారు చేయాలని
ఆదేశించారు.

ఈ నెల 18వ తేదీన శనివారం రాష్ట్ర కేబినేట్ సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అందులో రాష్ట్ర పునర్విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న అంశాలు, ఏపీతో పీటముడిగా ఉన్న అంశాలను చర్చించనున్నారు. వీటితో పాటు రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చించనున్నారు. రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల ప్రక్రియ ముగియటంతో ముఖ్యమంత్రి ప్రజా పాలనపై దృష్టి కేంద్రీకరించారు. బుధవారం మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Also Read:KTR:పట్టభద్రుల స్ధానాన్ని నిలబెట్టుకుంటాం

- Advertisement -