సోమవారం శాసనసభలో తెలంగాణ బడ్జెట్ 2017-18ను ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి చేపట్టిన చర్యల వల్ల రెవెన్యూ పెరిగిందని తెలిపారు. దేశంలోనే 19.61 శాతం వృద్ధిరేటులో తెలంగాణ చాలా ముందుందన్నారు. పెద్దనోట్ల రద్దుతో ఆదాయం తగ్గినా.. ఇతర పన్నులతో పెరిగిందని తెలిపారు.ఉమ్మడి రాష్ట్రంలో చీకటి అనుభవించిన ప్రజలు సొంత రాష్ట్రంలో వెలుగు ఉంటుందని భావించారని.. దాన్ని సాకారం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి అన్నారు.
అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా బడ్జెట్‌ను రూపొందించినట్లు ఈటల రాజేందర్ తెలిపారు. అన్ని వర్గాల్లో విశ్వాసం నింపేలా బడ్జెట్ ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా బడ్జెట్ ను రూపొందించినట్లు తెలిపారు. 2017-18 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెట్టిన ఆయన కొత్త బడ్జెట్ రూ.1,49,446 కోట్లు అని తెలిపారు.
2017-18 బడ్జెట్ వివరాలు:
-రాష్ర్ట బడ్జెట్ రూ. 1,49,446 కోట్లు
-ప్రగతి పద్దు రూ. 88,038 కోట్లు
-నిర్వహణ వ్యయం రూ. 61,607 కోట్లు
-రెవెన్యూ మిగులు అంచనా రూ. 4,571 కోట్లు
-విద్యారంగ అభివృద్ధికి రూ. 12,705 కోట్లు
-వైద్య, ఆరోగ్య రంగాలకు రూ.5,976 కోట్లు
-పంచాయతీరాజ్ వ్యవస్థకు రూ. 14,723 కోట్లు
-పట్టణాభివృద్ధికి రూ. 5,599 కోట్లు
-మిషన్ భగీరథకు రూ. 3000 కోట్లు
-రహదారుల అభివృద్ధికి రూ. 5,033 కోట్లు
-జర్నలిస్టుల కోసం రూ. 30 కోట్లు
-మిగతా కార్పొరేషన్లకు రూ. 400 కోట్లు
-గ్రేటర్ వరంగల్ కు రూ. 300 కోట్లు
-జీహెచ్ఎంసీకి రూ. 1000 కోట్లు
-పర్యాటక, సాంస్కృతిక రంగానికి రూ. 198 కోట్లు
-శాంతి భద్రతలకు రూ. 4,828 కోట్లు
-ఐటీ రంగానికి రూ. 252 కోట్లు
-హరితహారానికి రూ. 50 కోట్లు
-విద్యుత్ రంగానికి రూ. 4,203 కోట్లు
-పారిశ్రామిక రంగానికి రూ. 985 కోట్లు
-ద్రవ్య లోటు రూ. 26,096 కోట్లు
-ఎస్టీల అభివృద్ధికి రూ. 8165.88 కోట్లు
-ఎస్సీల అభివృద్ధికి రూ. 14,375 కోట్లు
-నిర్ణీత కాలానికి పథకాల వారీగా 3 నెలలకొకసారి నివేదిక సమర్పించాలి
-ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికకు నిధులు కేటాయించేందుకు కమిటీ ఏర్పాటు చేశాం.