హస్తం, కమలం చాఫ్టర్ క్లోజ్..!

301
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్‌‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. వరుస పరాజయాలు, నేతల్లో అనైక్యత, పీసీసీ అధ్యక్ష పదవి కోసం కొట్లాట వెరసి కాంగ్రెస్‌‌కు ఇక రాష్ట్రంలో భవిష్యత్తు లేదని గ్రహించిన ఆ పార్టీ నేతలు వరుసగా కాషాయ పార్టీలోకి చేరుతున్నారు. పీసీసీ పదవి విషయంలో రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ సీనియర్ నేతలకు మధ్య జరుగుతున్న వివాదం కాంగ్రెస్ శ్రేణులను గందరగోళానికి గురి చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులలో రేవంత్‌రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినా పార్టీ పుంజుకోవడం కష్టమేనని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అందుకే రేవంత్‌రెడ్డికి సన్నిహితులైన హైదరాబాద్ నగర కాంగ్రెస్‌లో కీలక నేత, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ బీజేపీలో చేరారు. ఇందిరాశోభన్, ఏపూరి సోమన్నలు వంటి రేవంత్ సన్నిహిత నేతలు షర్మిల పార్టీలో చేరారు. కాంగ్రెస్‌కు ఇప్పుడు షర్మిల పార్టీ గండం వెంటాడుతోంది.

కాంగ్రెస్‌లోని వైఎస్ అభిమానులంతా మెల్లగా షర్మిల గూటికి చేరుతారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి నేతల నుంచి గ్రామస్థాయి నేతల వరకు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి ఇతర పార్టీలలో చేరుతున్నారు. నిన్న మొన్నటిదాకా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరికలు ఉండేవి. కాని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత బీజేపీ గ్రాఫ్ పడిపోతుంది. దేశంలో మోదీ పాలనపై జనాలు విసుగెత్తిపోయారు. హిందూత్వ సెంటిమెంట్‌తో రాజకీయాలు చేస్తున్న బీజేపీపై మైనారిటీ నేతలు మండిపడుతున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి వలసలు షురూ అయ్యాయి. తాజాగా యాచారం మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామ సర్పంచ్ హబీబుద్దిన్ గురువారం ఎమ్మెల్యే కిషన్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఈ మేరకు ఎమ్మెల్యే కిషన్ రెడ్డి స్వయంగా హబీబుద్దీన్‌కు టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ హభీబుద్దిన్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వ పాలనను అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారని ఈ క్రమంలో కొత్తపల్లి గ్రామం మరింత అభివృద్ధి పథంలో ఉండాలని, గ్రామాభివృద్దే లక్ష్యంగా టీఆర్ఎస్‌లో చేరడం జరిగిందన్నారు. సర్పంచ్‌తో పాటు పలువురు వార్డు సభ్యులు కూడా టీఆర్ఎస్‌లో చేరారు. కాగా సాగర్ ఉప ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్‌లోకి వలసలు షురూ అయ్యాయి. రాష్ట్రానికి సీఎం కేసీఆర్ పాలనే శ్రీరారమక్ష..టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మిన బీజేపీ , కాంగ్రెస్ నేతలు గులాబీ కండువా కప్పుకుంటున్నారు. సాగర్‌లో టికెట్ విషయంలో బండి సంజయ్ నమ్మించి మోసం చేయడంతో ఆగ్రహించిన బీజేపీ కీలక నేత కడారి అంజయ్య యాదవ్ తన వందలాది మంది అనుచరులతో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. మరోవైపు జానారెడ్డి కుటుంబ పెత్తనంపై విసిగిపోయిన కాంగ్రెస్ మండల స్థాయి నేతలు సాగర్ ఉప ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్‌లో చేరుతున్నారు. మొత్తంగా బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నుంచి టీఆర్ఎస్‌లో వలసలు షురూ అవడం ఆసక్తిగా మారింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత బండి సంజయ్ గ్రాఫ్ పడిపోయిందని, సాగర్ ఉప ఎన్నికలలో కూడా టీఆర్ఎస్ విజయం సాధించిన తర్వాత రాష్ట్రంలో పొలిటికల్ సీన్ మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. .బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి నేతల చేరికతో రాష్ట్రంలో మరోసారి టీఆర్ఎస్ బలీయమైన శక్తిగా అవతరిస్తుందని, ఇక సీఎం కేసీఆర్‌‌కు ఎదురే ఉండదని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

- Advertisement -