అణగారిన కులాల ఆత్మగౌరవం నిలిపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కి దూరంగా ఉండి, సంచార జీవనం సాగిస్తున్నా గుర్తింపు లేని 17 సంచార జాతులను బిసి కులాల జాబితాలోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం వల్ల 17 సంచార జాతులలోనున్న బైల్ కమ్మర, గీశాడి, గడియ, లోహ కులానికి స్వతంత్రం లభించిన నాటినుండి నేటివరకు సుమారు గత 70 ఏండ్ల తరువాత మొట్ట మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం, రెవెన్యూశాఖ కుల ధ్రువీకరణ పత్రాన్ని జారీచేసినందుకు 17 సంచార జాతుల ఐక్యవేదిక సంఘాల నాయకులు రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్‌ను కలసి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కులసంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. గత 73 ఏండ్ల స్వతంత్ర భారతంలో మేము భూమి మీద ఉన్నా.. ప్రభుత్వ రిజర్వేషన్లు దృష్టిలో లేకుండా ఇన్నెండ్లు ఎన్నో బాధలు పడ్డామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చి వెళ్లిన మమ్మల్ని పట్టించుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బిసి కమిషన్ ఏర్పాటు చేసి వారి ద్వారా 17 కులాలకు సంబంధించిన ఇచ్చిన నివేదికను ఆధారంగా బిసి కులాల జాబితాలోకి తీసుకొవటం వల్ల మా కులాలకు గుర్తింపు లభించిందన్నారు.
అందుకు సంచార జాతుల ఐక్యవేదిక తరుపున పూర్తి సహకారం అందించిన మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, పురపాలక మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం వల్ల 17 కులాలకు సంబంధించి సుమారు 9, 839 కుటుంబాలలో పండుగ వాతావరణం నెలకొందన్నారు. ప్రభుత్వం అందించే ధ్రువీకరణ పత్రాల వల్ల సంక్షేమ పథకాలు, అభివృద్ధి, విద్యా, ఉద్యోగ అవకాశాలలో అర్హులవుతామన్నారు. సీఎం కేసీఆర్ కి జన్మంతా రుణపడి ఉంటామన్నారు.
ఈ కార్యక్రమంలో 17 కులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మోహన్ చౌహన్, సంచార కులాల టీవీ చైర్మన్ పొదిల వెంకటరమణ, బిసి ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు వెల్లపు దుర్గారావు, కోశాధికారి పసుపులేటి కరుణాకర్, సంఘాల నాయకులు పి.మల్లేష్, తిరుమల దేవి, లక్ష్మణ్, గోపాల్ మరియు 17 కులాల ప్రతినిధులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.