సీఎం స్టాలిన్‌తో తెలంగాణ బీసీ కమిషన్‌ భేటీ..

42
CM Stalin
- Advertisement -

తమిళనాడు రాష్ట్రం చేపట్టిన కులగణన, రిజర్వేషన్ల అమలుతీరు తెన్నుల అధ్యయనం చేయడానికి ఇక్కడికి వచ్చినట్లు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ బృందం ఆయనకు వివరించింది. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌ డా॥ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు సారథ్యంలో సభ్యులు సిహెచ్‌.ఉపేంద్ర, శుభప్రద్‌పటేల్‌ నూలి, కె.కిషోర్‌ గౌడ్‌లు శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశం 10ని॥లు కొనసాగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని శాలువాతో సన్మానించి, పలు పుస్తకాలను అందజేయడం జరిగింది. పర్యటనలో భాగంగా మర్యాదపూర్వకంగా ఈ ప్రతినిధుల బృందం కలిసింది.

గడిచిన 3 రోజులుగా ఇక్కడే తమిళనాడులో వేసిన బీసీ కమిషన్‌ ప్రతినిధుల బృందం తమిళనాడు బీసీ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌. తనికాచలం, బీసీ, ఎంబీసీ, మైనారిటి శాఖల మంత్రి రాజకన్నప్పన్‌, ముఖ్యకార్యదర్శి కార్తిక్‌ ఐఏఎస్‌, పంచాయతి రాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీమతి అముద ఐఏఎస్‌, మరియు ఇతర ముఖ్య అధికారులతో సమావేశమై అనేక అంశాలపై అరాతీశారు. ఈ సమావేశాలన్ని అధ్యయనం కొనసాగింపులో భాగంగా తమిళనాడులో పర్యటించారు.

ఈ రోజు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో సమావేశమైన డా॥ వకుళాభరణం నేతృత్వంలో బృందం తాము చేయబోయే అధ్యయన వివరాలు కూడా ఆయన దృష్టికి తెచ్చారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలలో పరిమాణాత్మకంగా (క్వాంటిఫయబుల్‌ డేటా), రిజర్వేషన్ల శాతం స్థిరీకరణ, సమాచార సేకరణలో అవలంబించాల్సిన పద్దతులను ఇక్కడి అధికారులతో సమగ్రంగా సేకరిస్తున్నట్లు స్టాలిన్‌కు వివరించారు. అలాగే స్థానిక ఇ.వి.కే. సంపత్‌ రోడ్‌లో ఉన్న ద్రావిడ ఉద్యమ దిగ్గజం, ప్రముఖ సంఘ సంస్కర్త ఇ.వి. పెరియార్‌ రామస్వామి స్మారక స్థలాన్ని శుక్రవారం బీసీ కమిషన్‌ బృందం సందర్శించింది.

- Advertisement -