రాష్ట్రంలో ఏ రూపంలో ఉన్న డ్రగ్స్ అక్రమ రవాణాను నిరోధించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. మంగళవారం ఉదయం బీఆర్కే భవన్‌లో సీఎస్ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిరోధక కమిటీ సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డ్రగ్స్ వినియోగాన్ని, అక్రమ రవాణాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన పటిష్టమైన చర్యలు గురించి చర్చించామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల రవాణాను గుర్తించేందుకు పోలీసు శాఖకు ఆధునిక పరికరాలను అందజేస్తామని సీఎస్ తెలిపారు.
రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధంపై ఇప్పటికే సీఎం కేసీఆర్ పలు మార్లు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో గంజాయి సాగు చేసే రైతులకు రైతుబంధు పథకాన్ని నిలిపివేస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పోలీస్ శాఖ, ఎక్సైజ్, ఆటవీ, గిరిజన సంక్షేమం, రెవెన్యూ శాఖలు కలిసి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం పై సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. మాదక ద్రవ్యాల వినియోగ నివారణ ఉన్నతస్థాయి కమిటీ సమావేశం ప్రతీ మూడు నెలలకు ఒక సారి జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా, ప్రతీ జిల్లాతో పాటు పోలీస్ కమీషనరేట్ లలో మాదక ద్రవ్యాల నిరోధక సెల్‌లను ఏర్పాటు చేశామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. డ్రగ్స్ విక్రయించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామని, పీడీ చట్టాన్ని కూడా విధిస్తున్నామని తెలిపారు.
ఈ సమావేశంలో హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి రవీ గుప్తా, నార్కోటిక్ కంట్రోల్ బోర్డు జాయింట్ డైరెక్టర్ పీ అరవిందన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ డైరెక్టర్ జనరల్ డీపీ నాయుడు, నార్కోటిక్ కంట్రోల్ బోర్డు దక్షణాది రాష్ట్రాల డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ముత్తా అశోక్ జైన్, సీఐడీ అదనపు డీజీ గోవింద్ సింగ్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఐజీ రాజేష్ కుమార్, ఎక్సైజ్ శాఖ కమీషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు హాజరయ్యారు.