రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల పెంపు బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. గిరిజనులకు 6 నుంచి 10 శాతం రిజర్వేషన్ల పెంపు, బీసీ-ఈలకు 4 నుంచి 12 శాతం రిజర్వేషన్ల పెంపు బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఉదయం 11 గంటలకు శాసనసభలో సీఎం కేసీఆర్ గిరిజనులు, బీసీ-ఈ వర్గాలకు రిజర్వేషన్ల పెంపు బిల్లును ప్రవేశపెట్టారు.
సీఎం ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల బిల్లు పెంపుపై సుదీర్ఘ చర్చ జరిగింది. బీజేపీ ఎమ్మెల్యేలు మినహా మిగతా పార్టీల ఎమ్మెల్యేలందరూ ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. రిజర్వేషన్ల పెంపు బిల్లుకు అడ్డుపడుతూ.. సభలో ఆందోళనకు దిగిన బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు.
చివరగా సీఎం మాట్లాడుతూ.. రిజర్వేషన్ల పెంపు బిల్లుకు మద్దతు తెలిపినందుకు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ బిల్లు విషయంలో విజయం సాధిస్తామన్న నమ్మకం ఉందన్నారు సీఎం. విపక్షాలు అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానమిచ్చారు. రిజర్వేషన్ల పెంపు విషయంలో ఎవరికీ అనుమానం అవసరం లేదన్నారు.
మతపరమైన రిజర్వేషన్లు కాదు.. వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల బిల్లు అని సీఎం కుండబద్దలు కొట్టారు. మనం పంపిన బిల్లును యథాతథంగా కేంద్రం పాస్ చేస్తుందని తాను అనుకోనని సీఎం అన్నారు. కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయన్నారు. స్వల్పంగా మార్పులుంటే ప్రభుత్వానికి అభ్యంతరం లేదన్నారు సీఎం. రిజర్వేషన్ల పెంపును కేంద్ర అంగీకరించకపోతే.. ఏం చేయాలో ఆలోచిస్తాం.. అవసరమైతే పార్లమెంట్ లో నిలదీస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు సీఎం.