తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 15 దాకా కొనసాగనున్నాయి. ఈ విషయాన్ని తెలంగాణ అసెంబ్లీ వ్యవహారాల కమిటీ (బీఏసీ) ప్రకటించింది. సోమవారం ఉదయం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు ప్రారంభం కాగానే.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి చెందిన వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభను ఈ నెల 9కి వాయిదా వేశారు స్పీకర్ పోచారం.
సభ వాయిదా అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం మొదలైంది. ఈ సమావేశంలో సభలో చర్చించాల్సిన అంశాలు, అందుకు అవసరమయ్యే సమయాన్ని బేరీజు వేసుకున్న ప్రభుత్వం… ఈ నెల 15 వరకు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని తీర్మానించింది. ఏడు రోజుల పాటు శాసనసభ సమావేశాలు కొనసాగనున్నాయి. 9వ తేదీన బడ్జెట్‌పై సాధారణ చర్చ చేపట్టనున్నారు. 10, 11, 12, 14 తేదీల్లో పద్దులపై చర్చించనున్నారు. 15వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించనున్నారు. 8, 13వ తేదీల్లో సభకు సెలవు ప్రకటించారు.