తెలంగాణ అసెంబ్లీ,మండలి సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. మే 29 నుండి 31 వరకు మూడు రోజులపాటు శాసనసభ, మండలి సమావేశాలు జరిపే వీలుంది. ఈ సమావేశాల్లో కొత్త రెవెన్యూ, మున్సిపాలిటి చట్టాలపై చర్చ జరిపి అమోదం తెలపనున్నారని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈ నెల 28న మంత్రివర్గ సమావేశంలో ముసాయిదాను అమోదించనున్నారు. తర్వాత గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
సీఎం ఆదేశాల మేరకు సీఎస్ ఎస్కే జోషి అన్ని శాఖలకు మంత్రిమండలి సమావేశంపై సమాచారం పంపించారు. ఆయా శాఖలకు సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాలు, పెండింగు అంశాలపై ఈ నెల 25లోగా వివరాలు ఇవ్వాలని సూచించారు.
కొత్త రెవెన్యూ, మున్సిపాలిటీ చట్టాల రూపకల్పనతో పాటు పలు పాలనాపరమైన అంశాలకూ మంత్రిమండలి పచ్చజెండా ఊపనుంది. మే 23తో ఎన్నికల కోడ్ ముగియనుండటంతో రైతుబంధు, ఆసరా, ఇతర పథకాల సాయం పెంపు వంటి వాటికి కూడా మంత్రిమండలి ఆమోదముద్ర వేసే అవకాశాలు ఉన్నాయి. జూన్ రెండో తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉద్యోగాల భర్తీ, వివిధ నిర్మాణాలకు స్థలాల కేటాయింపులపై కీలక నిర్ణయాలుండనున్నట్లు తెలుస్తోంది.