తెలంగాణలో ఎంతో కాలంగా న్యాయవాద లోకం ఎదురుచూస్తున్న కీలక చట్టం నేటి నుండి అధికారికంగా అమల్లోకి వచ్చింది. న్యాయవాదులపై పెరుగుతున్న దాడులు, బెదిరింపులు, మరియు వేధింపులను అరికట్టే లక్ష్యంతో రూపొందించిన తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం-2026 (Telangana Advocates Protection Act, 2026) జూన్ 2 నుండి అమలు చేయబడుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు చట్టంలోని నిబంధనలను అమలు చేస్తూ రాష్ట్ర లా డిపార్ట్‌మెంట్ (న్యాయశాఖ) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం, 2026 లోని సెక్షన్ 1, సబ్-సెక్షన్ (3) ద్వారా సంక్రమించిన అధికారాల ప్రకారం.. 2026, జూన్ 2వ తేదీ నుండి ఈ చట్టంలోని నిబంధనలన్నీ అమల్లోకి వస్తాయని ప్రభుత్వం దీని ద్వారా ప్రకటిస్తోంది అని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
()తెలంగాణ శాసనసభ ఈ ఏడాది ఆరంభంలోనే ఈ బిల్లును ఆమోదించింది. ఇటీవల కాలంలో విధి నిర్వహణలో ఉన్న లాయర్లపై దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ చట్టం వారికి రక్షణ కల్పించనుంది.
()ప్రాణహాని లేదా బెదిరింపులు ఎదుర్కొంటున్న న్యాయవాదులకు అవసరమైన పోలీసు భద్రత కల్పిస్తారు.
()కక్షసాధింపు చర్యల్లో భాగంగా న్యాయవాదులపై పెట్టే తప్పుడు కేసుల నుండి తగిన రక్షణ లభిస్తుంది.
() వేధింపులు, బెదిరింపులు లేదా విధి నిర్వహణకు ఆటంకం కలిగించే అంశాలపై ఫిర్యాదు చేయడానికి మరియు వాటిని త్వరితగతిన పరిష్కరించడానికి ఒక ప్రత్యేక పద్ధతి ఈ చట్టం ద్వారా అందుబాటులోకి రానుంది.


