ఇబ్బడిముబ్బడిగా రోజు రోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల దృష్యా రోడ్డు భద్రత మీద సుప్రీంకోర్టు పలు సూచనలు చేయడం జరిగింది. రోడ్డు భద్రత అనేది మూడు అంశాల మీద ముడిపడి వుంటుంది. ఒకటి వాహనం, రెండోది డ్రైవరు, మూడోది రోడ్డు. ఈ మూడు అంశాలు సాంకేతికతకు.. అంటే టెక్నాలజీ, టెక్నికల్ నాలెడ్జి, టెక్నికల్ నైపుణ్యమునకు సంబంధించిన విషయాలు అని సుప్రీంకోర్టు వెల్లడించింది. అంటే సాంకేతిక పరిజ్ఞానం వున్న వ్యక్తులు, పరిపూర్ణ టెక్నికల్ విద్యను అభ్యసించిన వ్యక్తులకే ఈ అంశాల మీద పట్టువుంటుంది. రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ప్రణాళికలను పకడ్బందీగా రచించే ఆస్కారం ఉంటుంది. ఆర్టీఓ, యంవిఐ మరియు ఎయంవిఐ లు ప్రతి రోజు నిర్వహించే ఉద్యోగం సాంకేతికతతో ముడిపడి ఉంటుంది. పరిపూర్ణ సాంకేతిక విద్యార్హతలు మరియు నైపుణ్యం వుండే వ్యక్తులయుతేనే సమర్థవంతంగా విధులు నిర్వర్తించగలుగుతారు. ఇప్పుడున్న సర్వీసు రూల్స్ ప్రకారం ఒక సాధారణ డిగ్రీ చదివిన వ్యక్తి గ్రూపు వన్ ద్వారా ఆర్టీఓ కావచ్చు. అలాగే ఓ జూనియర్/సీనియర్ అసిస్టెంట్, ఓ ట్రాన్స్ పోర్ట్ కానిస్టేబుల్ రెగ్యులర్‌గా ఉద్యోగం చేస్తూ దొడ్డిదారిన ఏదో ఒక రాష్ట్రంలో కరస్పాండెంట్‌గా డిప్లొమా చదివినట్లుగా సర్టిఫికెట్లు సబ్మిట్ చేసిన అసిస్టెంట్ మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్‌గా ఉద్యోగం పొందే ఆస్కారం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వానికి నిరుద్యోగుల ద్వారా పలు పిర్యాదులు అందాయి. ఈ విషయం నిగ్గుతేల్చడానికి ప్రభుత్వం సిబిసిఐడి విచారణకు ఆదేశించడం కూడా జరిగింది. సుధీర్ఘ విచారణ అనంతరం ఈ విధంగా అసిస్టెంట్ మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్ లుగా పదోన్నతి పొందిన వారు సమర్పించిన డిప్లొమా సర్టిఫికెట్లు నిబంధనల మేరకు లేవని తేల్చడం జరిగింది.
సిబి సిఐడి విచారణ రిపోర్ట్ ఆధారంగా సుమారు 40 మందిని వారి వారి యథా పోస్ట్ కు రివర్సను ఇవ్వడం జరిగింది. రివర్షన్ పొందిన వారు హైకోర్టు మరియు సుప్రీంకోర్టుకు వెళ్లడం మూలంగా అలాగే సుప్రీంకోర్టు మానవతా దృక్పథంతో ఇచ్చిన తీర్పులకు అనుగుణంగా అప్పటి వరకు ప్రమోషన్ లను కొనసాగించవలసిందిగా మరియు భవిష్యత్తులో ఎఐసిటిఇ ధృవీకరణ మరియు సంబందిత శాఖల ఆమోదం లేని డిప్లొమా లేదా ఇంజనీరింగ్ సర్టిఫికెట్లను ఆమోదించి పదోన్నతుల నియామకాలు చేపట్టకూడదని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసినట్లుగా తెలియవచ్చింది. సాంకేతికతో ముడిపడి ఉన్న ఈ ఉద్యోగాలను పరిపూర్ణ సాంకేతిక విద్యార్హతలు వున్న వారే సమర్థవంతంగా నిర్వర్తించగలుగుతారని పలువురు సాంకేతిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది రోడ్డు ప్రమాదాలలో మరణించడం గాని గాయపడడం గాని జరుగుతుంది. రోడ్డు భద్రతకు సుప్రీంకోర్టు అధిక ప్రాధాన్యతనిస్తూ ఏర్పాటు చేసిన కమిటీ పలు కీలక అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఇలాంటి ఈ పరిస్థితులలో దొడ్డిదారిన దొంగ డిప్లొమా సర్టిఫికెట్లు పొందిన వారిని పదోన్నతులు కల్పించకుండా, పకడ్బందీగా సర్వీసు రూల్స్ ను అమలు చేయాల్సి అవసరం ఎంతైనా వుందని ప్రభుత్వం అభిప్రాయపడినట్లుగా తెలుస్తుంది. ప్రజల ప్రాణాలు, రోడ్డు భద్రత నిర్వర్తించే ఉద్యోగుల సాంకేతిక నైపుణ్యం, నాలెడ్జితో ఆధారపడి వుంటుంది. రోడ్డు భద్రత మరియు రోడ్డు ప్రమాదాల విషయంలో ఎలాంటి అలసత్వానికి తావు ఇవ్వకుండా,రోడ్డు భద్రత మీద సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ సూచించిన మేరకు పలు కీలక అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని, అలాగే పలు నిరుద్యోగ సంఘాలు మరియు సాంకేతిక విద్యార్హతలు కల్గిన నిరుద్యోగులు ఇచ్చిన రిప్రజెంటెషన్ల సూచనలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం పకడ్బందీగా రవాణాశాఖ సర్వీసు రూల్స్ మార్పు కొరకు మరియు ప్రభుత్వ ఆదేశాల మేరకు తక్షణం చేపట్టవలసిన పదోన్నతుల ప్రక్రియను కొనసాగించడానికి జీఓ ను రూపొందించి ఇవ్వడం జరిగింది.
ఈ జీవో లో పొందుపరిచిన అంశాలు..
1.ఆర్టీఓ పోస్ట్ డైరెక్ట్ రిక్రూట్ మెంట్ కు విద్యార్హతను సాధారణ డిగ్రీకి బదులుగా బి.టెక్ మెకానికల్ / ఆటోమొబైల్ లేదా తత్సమానమైన విద్యార్హత గా మార్పు.
2.ఏఓ నుండి ఆర్టీఓగా పదోన్నతి పొందడానికి ఎఐసిటిఇ దృవీకరించిన సంబంధించిన డిప్లొమా సర్టిఫికెట్ కలిగివుండడం కనీస విద్యార్హత గా మార్పు.
3.అధిక సంఖ్యలో సాంకేతిక విద్యార్హతలు కల్గివుండి నిరుద్యోగులుగా వుండటాన్ని దృష్టిలో పెట్టుకొని 95 శాతం ఖాళీగా వున్న అసిస్టెంట్ మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్ పోస్ట్ లను సర్వీసు కమిషన్ ద్వారా నియామకం చేయడం. మిగిలిన 5 శాతం పోస్ట్ లను అర్హులైన ఎఐసిటిఇ ధృవీకరణ ఉన్న సంబంధిత డిప్లొమా సర్టిఫికెట్ కలిగివున్న ట్రాన్స్ పోర్ట్ హెడ్ కానిస్టేబుల్స్ కు పదోన్నతి ద్వారా భర్తీ చేయడానికి నిర్ణయం.
రోడ్డు భద్రత మరియు రోడ్డు ప్రమాదాల నివారణకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ దేశంలోనే మొదటి సారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు నియమించిన కమిటీ చేసిన పలు సూచనలను పరిగణనలోకి తీసుకుని రవాణాశాఖ సర్వీసు రూల్స్ ను వినూత్నంగా మార్పు చేయడం పట్ల పలువురు ఆనందాన్ని వెలిబుచ్చారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి సాంకేతిక నైపుణ్యం కలిగిన వారినే నియమించడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మార్పు చేసినట్లుగా ప్రజలు భావిస్తున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడటంపై ప్రభుత్వానికి వున్న చిత్తశుద్ధియే ఈ జీఓ అని సాంకేతిక వైజ్ఞానికులు అభిప్రాయపడుతున్నారు. ఖాళీలుగా వున్న 95 శాతం అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్స్ ఉద్యోగాలను సర్వీసు కమిషన్ ద్వారా భర్తీ చేయడానికి నిర్ణయం తీసుకోవడం పట్ల సాంకేతిక విద్యార్హత కలిగిన నిరుద్యోగులు, నిరుద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి మరియు రవాణా శాఖ మంత్రికి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షాతిరేకం వెలిబుచ్చుచున్నారు.