రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రువులు ఉండరన్నది అందరికీ తెలిసిందే. కానీ, ఈ శత్రుత్వాలు రాత్రికి రాత్రే మారిపోతాయన్న దానికి చాలా ఉదాహరణలుండగా, తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు లెటెస్ట్ ఎగ్జామ్ పుల్ గా తీన్మార్ మల్లన్న కనిపించబోతున్నారా…? అంటే అవుననే ప్రచారం జరుగుతుంది. టీఆర్ఎస్ ను, కేసీఆర్ అండ్ టీంను చిన్న చిన్న దానికి లింక్ పెట్టి మరీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ తిట్టిపోస్తారు. ఇది అందరికీ తెలిసిందే. ప్రబుత్వానికి వ్యతిరేకంగా పోరాటంలో నేనే ముందున్నా అన్నంత కలరింగ్ ఇస్తూ, తన సొంతిల్లు చక్కపెట్టుకుంటారని ఆయనపై ఎన్నో విమర్శలున్నాయి. అయితే, బీజేపీ తీర్థంపుచ్చుకొని ఆరు నెలలైనా గడవకముందే తీన్మార్ యూ టర్న్ తీసుకున్నాడు. ఈ యూ టర్న్ కు పది రోజుల ముందు నుండే కాంగ్రెస్ ను పొగుడుతూ తీన్మార్ కామెంట్స్ చేయటంతో కాంగ్రెస్ గూటికి చేరుతాడని అంతా అనుకున్నారు. తను కూడా బీజేపీకి దూరమయినట్లేనని కామెంట్ కూడా చేశాడు.
కానీ, తీరా టీఆర్ఎస్ ను తిట్టిపోసే ఓ యూట్యూబ్ ఛానెళ్ ఇంటర్వ్యూలో రాబోయేది, గెలవబోయేది టీఆర్ఎస్ పార్టీయేనని… ఇందులో ఏమన్న డౌట్ ఉందా అంటూ కామెంట్ చేయటంతో పాటు పోతే అటే పోతా అంటూ వ్యాఖ్యానించటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తీన్మార్ ను ఇంటర్వ్యూ చేసిన ఛానల్ తో తనకు సత్సంబంధాలున్నాయి. ఒకవేళ పొరపాటున తను ఆ మాట అంటంటే బయటకు రాకముందే ఎడిటింగ్ లో కట్ చేసే వారు. కానీ అలా జరగలేదు. అంటే వాంటెడ్ గా చేసిన వ్యాఖ్యలేనని, దీనికి వెనుక పాజిటివ్ సిగ్నల్స్ ను టీఆర్ఎస్ కు పంపే ఉద్దేశం కనపడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
కేసీఆర్ తో తాను పోటీ పడలేనని గ్రహించాకే తీన్మార్ కాళ్లబేరానికి వచ్చారని… అందుకే ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే, తన వ్యాఖ్యల ద్వారా తాను ఓ మాట మీద నిలబడే వ్యక్తిని కాదని తనే ఒప్పుకున్నట్లు కూడా భావించవలసి ఉంటుందని, ఇలాంటి రాజకీయాలు ఎక్కువ కాలం కొనసాగలేవని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. బీజేపీ ఎంపీతో కలిసి తీన్మార్ ఆడిన నాటకాలపై ఇప్పుడు ఏం సమాధానం చెప్తావ్ అంటూ ఇటు టీఆర్ఎస్ శ్రేణులు ఫైర్ అవుతూనే, తను టీఆర్ఎస్ గెలుస్తుందన్నవ్యాఖ్యల వీడియోను ఫుల్ వైరల్ చేస్తోంది కేసీఆర్ దండు.