గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న RRRటీం..

161
challlenge
- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ – ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొంది చిత్రయూనిట్. ఎంపీ సంతోష్ కుమార్‌తో కలిసి రాజమౌళి,ఎన్టీఆర్,చరణ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు… పచ్చదనాన్ని పెంపొందించడం తమ మనసుకు దగ్గరైన కార్యక్రమం అన్నారు.

బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్నందుకు ఆర్‌ఆర్‌ఆర్ బృందాన్ని ఎంపీ సంతోష్ కుమార్ అభినందించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో వీరు మొక్కలు నాటారు. ప్రకృతి, పర్యావరణం తమకెంతో ఇష్టమని, వీలైనప్పుడల్లా సిబ్బందితో కలిసి హరితహారం పెంపుదల కార్యక్రమంలో పాల్గొంటామని దర్శకుడు రాజమౌళి తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో బాహుబలి టీమ్ పాల్గొన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

హీరో జూ.ఎన్.టి.ఆర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణంలో వస్తున్న మార్పులను తెలుసుకుని పచ్చని పందిరి పెంపునకు అవగాహన కల్పించి ప్రకృతి పరిరక్షణకు పాటుపడాలన్నారు. ఇంతకుముందు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నానని, మొక్కలు నాటడంలో ప్రతిసారీ ఉత్సాహంగా ఉంటానని హీరో రామ్ చరణ్ అన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ విడుదల సందర్భంగా ప్లాంటేషన్‌లో పాల్గొన్నందుకు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. సమాజహితమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా హరిత చైతన్యాన్ని నింపుతున్న ఎంపీ సంతోష్‌కుమార్‌ను ఆర్‌ఆర్‌ఆర్ బృందం అభినందించింది.

సినిమా మాధ్యమం అత్యంత శక్తిమంతమైనదని, సమాజానికి చక్కటి హరిత సందేశాన్ని అందించే హీరోలతో పాటు చిత్ర నిర్మాణంలో భాగమైన 24 ఫ్రేమ్స్ ఆర్టిస్టులకు స్ఫూర్తిదాయకమన్నారు ఎంపీ సంతోష్. సినిమా రిలీజ్ షెడ్యూల్‌లో బిజీగా ఉన్నప్పటికీ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఈవెంట్‌లో పాల్గొన్న టీమ్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సహ వ్యవస్థాపకులు కరుణాకర్ రెడ్డి, రాఘవ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -