వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా వేసుకోబోయే జెర్సీ మారింది. ఇంగ్లండ్‌లో వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో జరిగే ఈ ఫైనల్లో భారత ఆటగాళ్లు కొత్త జెర్సీ ధరించనున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం రూపొందించిన ఈ నూతన జెర్సీని పలువురు భారత ఆటగాళ్లు తమ సోషల్ మీడియా అకౌంట్లలో ప్రదర్శిస్తున్నారు. పుజారా, రవీంద్ర జడేజా నూతన జెర్సీ ధరించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఎప్పుడెప్పుడు బరిలోకి దిగాలా అని ఉంది అంటూ పుజారా తన సోషల్ మీడియా ఖాతాలో కామెంట్ చేశాడు.
జూన్ 18 నుంచి న్యూజిలాండ్ తో సౌతాంప్టన్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం త్వరలోనే ఇంగ్లండ్ పయనం కానున్న భారత బృందం ప్రస్తుతం ముంబయిలో క్వారంటైన్‌లో ఉంది. ఇంగ్లండ్ వెళ్లిన తర్వాత అక్కడి నిబంధనల ప్రకారం మరికొన్ని రోజులు క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఇక ఇప్పటికే ఇండియాలో తొలి డోసు తీసుకున్న ప్లేయర్స్‌కు రెండో డోసును ఇంగ్లండ్‌లో ఇచ్చే ఏర్పాట్లు కూడా బీసీసీఐ చేస్తోంది.