మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇటివలే 65మందితో కూడిన మొదటి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కాంగ్రెస్ రెండో లిస్ట్ కూడా ప్రకటించింది. పొత్తుల్లో భాగంగా ఖైరతాబాద్, జూబ్లిహిల్స్ టికెట్ టీడీపీకే కేటాయిస్తారని వార్తలు వచ్చాయి. తాజాగా ప్రకటించిన లిస్ట్ లో టిడిపి నేతల పేర్లు లేకపోవడంతో కార్యకర్తలు ఎన్టీఆర్ భవన్ వద్ద ఆందోళన చేస్తున్నారు.
జూబ్లిహిల్స్, ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలను టీడీపీకి ఇస్తామన్నకాంగ్రెస్ మాట తప్పిందన్నారు. ఖైరతాబాద్ టికెట్ దాసోజు శ్రావణ్ కు ఇవ్వడంతో టిడిపి ఇంఛార్జ్ దీపక్ రెడ్డి అనుచరులు ఆందోళనకు దిగారు. పార్టీకీ గత 20ఏళ్ల నుంచి సేవ చేస్తున్న దీపక్ రెడ్డికి అన్యాయం చేశారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మజ్జు అనే కార్యకర్త ఎన్టీఆర్ భవన్ ఎదుట ఉన్న విద్యుత్ పైలాన్ ఎక్కి నిరసన తెలిపాడు. దీపక్ రెడ్డికి టికెట్ ఇచ్చేంతవరకూ తాను కిందకి దిగనని చెబుతున్నాడు. దీపక్ రెడ్డి టికెట్ కోసం ప్రాణత్యాగం చేయడానికైనా వెనుకాడబోనని స్పష్టం చేశారు. దీంతో ఎన్టీఆర్ భవన్ కు చేరుకున్న పోలీసులు అతనితో ఫోన్లో చర్చలు జరుపుతున్నారు. ఈసందర్భంగా ఎన్టీఆర్ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్ధితి నెలకొంది.