సినీ నటి, మాజీ టీడీపీ నాయకురాలు కవిత బిజెపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటోంది. ఈ మేరకు ఇవాళ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌తో కవిత భేటీ అయింది. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో కవిత బీజేపీలో చేరడంపై సంసిద్దత వ్యక్తం చేసినట్లు సమాచారం.
కవిత బీజేపీలో చేరాలని అనుకుంటున్నారని లక్ష్మణ్ వెల్లడించారు. దేశాన్ని అన్ని విధాలుగానూ ముందుకు తీసుకెళ్లగల పార్టీ బీజేపీ మాత్రమే అని…అందుకే బీజేపీలో చేరేందుకు ముందుకువస్తున్నారని తెలిపారు.
టీడీపీలో క్రియాశిలకంగా పనిచేసిన కవిత…తెలుగు మహిళా అధ్యక్షురాలిగా సైతం పనిచేశారు. ఈ ఏడాది జరిగిన మహనాడులో తనకు అవమానం జరిగిందని సినీ నటి కవిత బహిరంగంగా పార్టీపై విమర్శలకు దిగారు. మహానాడు మధ్యలోనే వెళ్లిపోయిన ఆమె తర్వాత పలు సందర్భాల్లో టిడిపి నాయకత్వంపై విమర్శలు గుప్పించారు.
పార్టీలో కొత్తగా వచ్చినవారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె పలుమార్లు విమర్శలు ఎక్కుపెట్టారు. అదే సమయంలో నామినేటేడ్ పదవుల విషయంలో కూడ పార్టీ నాయకత్వం అనుసరించిన తీరుపై ఆమె అసంతృప్తిగా ఉంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని టిడిపికి గుడ్‌బై చెప్పాలని కవిత భావించారని అంటున్నారు.