తెలంగాణ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను పరిపుష్టి చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్,పిసిసి అధికార ప్రతినిధి రవీందర్ రావుతో పాటు నేతలు పెద్ద సంఖ్యలో గులాబీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారికి సీఎం కేసీఆర్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
రాష్ట్రాభివృద్ధి టీఆర్ఎస్‌తోనే సాధ్యమని భావించి పార్టీలో చేరిన వారందరికి హృదయ పూర్వకంగా స్వాగతం పలుకుతున్నామని తెలిపారు సీఎం. జాతీయ స్ధాయి నాయకుల అంచనాలను తలకిందులు చేస్తు అనేక రంగాల్లో తెలంగాణ అగ్రభాగంలో నిలిచిందని తెలిపారు. ఉద్యమ సమయంలో చెప్పిన మాటలన్ని నూటికి నూరు శాతం నిజమవుతాయని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాకు గతంలో ఎన్నడు లేని విధంగా నీరు ఇచ్చుకోగలిగామని చెప్పారు. తెలంగాణ అన్ని రంగాల్లో ముందుండటం చరిత్రాత్మకమని చెప్పారు.
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు అవాకులు చవాకులు పేలుతున్నాయని చెప్పారు. సర్వేలు బోగస్ కావని ప్రతిపక్షాల బుద్ది బోగస్ అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలో చెప్పాలని సీఎం మండిపడ్డారు. 60 సంవత్సరాలలో తెలంగాణకు కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్‌కు ఓటేయడానికి కరెంట్ ఒక్క అంశం చాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నిజాయితీతో పనిచేస్తుందని చెప్పారు. నాటి కాంగ్రెస్ పాలనకు నేటి టీఆర్ఎస్ పాలనకు తేడాను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.
ఆదిలాబాద్ జిల్లా అద్భుతంగా పురోగమిస్తుందన్నారు. రైతుల సంక్షేమం గురించి కాంగ్రెస్ ఏనాడు ఆలోచించలేదని చెప్పారు. సమైక్య పాలనలో తెలంగాణ ఆగమైందన్నారు. వ్యవసాయానికి పూర్వవైభవం తీసుకొస్తామని…కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని చెప్పారు. చరిత్రలో ఎప్పుడు ఎవరు చేయని మంచిపనులు చేస్తున్నామని వెల్లడించారు. అన్నివర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతమని చెప్పారు. నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే సమైక్య పాలకుల వంత పాడారని గుర్తుచేశారు సీఎం.
అంగన్ వాడీ వర్కర్లను ఏనాడు కనీసం మనుషులుగా కూడా చూడలేదని కాంగ్రెస్,టీడీపీలపై మండిపడ్డారు. కరెంట్ డిపార్ట్‌మెంట్‌లో 24 వేల మందిని రెగ్యులరైజ్ చేయబోతున్నామని చెప్పారు. హోంగార్డుల గౌరవ వేతనం 12 వేలకు పెంచామని త్వరలోనే వీరిని రెగ్యులరైజ్ చేస్తున్నామని తెలిపారు. ప్రజలు టీఆర్ఎస్ పాలన పట్ల నమ్మకంతో ఉన్నారని…తెలంగాణను బంగార తెలంగాణగా మార్చలన్నదే తమ అభిమతమని తెలిపారు. ప్రాజెక్టులను అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని చెప్పారు. ప్రాజెక్టులు ఎందుకు ఆపుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడ రావన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రతిపక్షాలకు కనబడటం లేదా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ నాయకులకు విశ్వాసం ఉంటే తమ పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. ఇప్పటికైన అవాకులు,చవాకులు పేలడం మానాలన్నారు. నాయకులపై విశ్వాసం ఉంటే కులం,మతం ఓట్లతో సంబంధం లేకుండా ప్రజలు గెలిపించి తీరుతారని చెప్పారు. భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే గిరిజన సోదరులకు 12 శాతం రిజర్వేషన్ కల్పించి తీరుతామన్నారు.
రైతుల రుణమాఫీని అమలుచేసి చూపించిన ఘనత తమకే దక్కిందన్నారు. చంద్రబాబు లాంటి మోసగాళ్లకు తెలంగాణలో చోటు లేదన్నారు.కాంగ్రెస్,టీడీపీ,కమ్యూనిస్టులకు కాలం చెల్లిందని జోస్యం చెప్పిందన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తాము చెప్పిందే నిజమైందని రానున్న ఎన్నికల్లో కూడా అదే జరుగుతుందన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన రామేష్ రాథోడ్, రవీందర్ రావులకు మంచి గుర్తింపు ఉంటుందని చెప్పారు. ఆదిలాబాద్‌లో ఇక టీఆర్ఎస్‌కు తిరుగులేదన్నారు. పాత కొత్త అంతా కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా కేసీఆర్ సూచించారు.