హుజుర్ నగర్ ఉప ఎన్నిక రసవత్తరంగా సాగుతుంది. నామినేషన్ ప్రక్రియ రేపటితో ముగియనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్ధులను ప్రకటించి ప్రచారంలో బిజీగా ఉన్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ కూడా హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఇవాళ అభ్యర్ధిని ప్రకటించనున్నట్లు తెలిపారు టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీడీపీ బలంగా ఉందని అందుకే తాము పోటీ చేస్తున్నట్లు పేర్కోన్నారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిగా ఏర్పడి టీడీపీ, కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. కూటమిలో భాగంగా హుజుర్ నగర్ సీటును టీపీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేటాయించారు. ఇక ఈ ఉప ఎన్నికకు టీడీపీ అభ్యర్ధి ఏవరా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 21న జరిగే ఎన్నికకు రేపటితో నామినేషన్లు ముగియనున్నాయి. అక్టోబర్ 24ను ఫలితాలు వెలువడనున్నాయి.