తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను తెలంగాణ వ్యాప్తంగానే కాక ప్రపంచ వ్యాప్తంగా కూడా తెలంగాణ వాసులు ఘనంగా నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజుల బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు వేమకాయల బతుకమ్మ పండుగను తెలంగాణ ఆడపడుచులు సంబురంగా జరుపుకున్నారు. ఖండాంతరాల్లో ఉన్న తెలంగాణ బిడ్డలు పువ్వులను పూజించే పండుగ, తెలంగాణ పూల పండుగ బతుకమ్మ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.
కెనడాలో కెనడా తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో 600 మంది తెలంగాణ కెనడా మహిళలు హాజరై బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు. బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా పలు పోటీలను కూడా నిర్వహించారు. తమ పిల్లలకు తెలంగాణ పండుగల గొప్పతనాన్ని వివరించారు. తెలంగాణ వంటకాలు, తెలంగాణ రుచులు, తెలంగాణ సంస్కృతిపై వివరించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ బంగారు తెలంగాణ అభివృద్ధికి పాటు పడుతూనే తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను నిలబెడుతూ ఉండే కార్యక్రమాలను చేస్తూ ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీఎఫ్ కెనడా పౌండేషన్ కమిటీ చైర్మన్ గంట మాణిక్ రెడ్డి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ చైర్మన్ గార్లపాటి జితేందర్, అధ్యక్షులు నెరవేట్ల శ్రీకాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు మడుపు విజయలక్ష్మి, జనరల్ సెక్రటరీ కోడం పవన్ కుమార్, జాయింట్ సెక్రటరీ అర్షద్ హోరి తదితరులు పాల్గొన్నారు.