విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులకు (FIIs) ప్రభుత్వం ప్రకటించిన పన్ను ఉపశమన నిర్ణయం మార్కెట్ సెంటిమెంట్‌ను గణనీయంగా పెంచుతుందని..భారతీయ రూపాయికి బలమైన మద్దతును అందిస్తుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా చీఫ్ ఇండియా ఎకనామిస్ట్ రాహుల్ బజోరియా శుక్రవారం అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టే విదేశీ పెట్టుబడిదారులకు పన్ను రాయితీలు కల్పించాలనే ప్రభుత్వ నిర్ణయంపై ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ పన్ను ఉపశమనం అంతర్జాతీయ ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంపొందిస్తుందని రాహుల్ బజోరియా పేర్కొన్నారు. ఈ నిర్ణయం సరైన సమయంలో వచ్చింది. ఇది విదేశీ పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను బూస్ట్ చేయడమే కాకుండా భారతీయ డెట్ మార్కెట్లలోకి మరిన్ని నిధులు వచ్చేలా ప్రోత్సహిస్తుంది. అంతర్జాతీయ బాండ్ సూచీలలో భారత్ చేరిన తరుణంలో ఈ పన్ను సరళీకరణ మరింత కీలకంగా మారనుంది అని ఆయన విశ్లేషించారు.
ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో, ఈ విధానపరమైన మార్పు దేశీయ కరెన్సీకి రక్షణగా నిలుస్తుందని బజోరియా తెలిపారు. విదేశీ నిధుల ప్రవాహం పెరగడం వల్ల విదేశీ మారక నిల్వలు మరింత బలపడతాయని, ఇది రూపాయి విలువలో వచ్చే హెచ్చుతగ్గులను నియంత్రించడానికి మరియు రూపాయి స్థిరత్వాన్ని కాపాడటానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎంతగానో సహాయపడుతుందని ఆయన వివరించారు.
Also Read:గ్రేట్ నికోబార్‌ను కాపాడుకుందాం!
భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తున్న తరుణంలో, ప్రభుత్వం తీసుకున్న ఈ పన్ను రాయితీ నిర్ణయం విదేశీ మూలధనాన్ని ఆకర్షించడంలో భారతదేశాన్ని ఇతర వర్ధమాన దేశాల కంటే ముందు వరుసలో నిలబెడుతుందని బోఫా నివేదిక పేర్కొంది.

