సింగరేణి కుంభకోణంపై విచారణ జరపాలి!

2
- Advertisement -

సింగరేణిలో జరిగిన 1600 కోట్ల భారీ బొగ్గు కుంభకోణం గురించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీకు ఈ లేఖ రాస్తున్నాను. తెలంగాణ కొంగుబంగారమైన సింగరేణిలో మరో భారీ కుంభకోణం కార్మిక లోకాన్ని తీవ్రంగా కలవరపరుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వరుస స్కాంలతో వణికిపోతున్న సింగరేణిలో 1600 కోట్లు విలువచేసే బొగ్గు మాయం చేసి సంస్థ గొంతుకోసే కుట్రకు తెరతీశారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 40 లక్షల మెట్రిక్ టన్నుల స్కామ్ జరగడం సంస్థ మనుగడనే ప్రమాదంలోకి నెడుతోంది అన్నారు.

సింగరేణి అధికారిక వెబ్ సైట్ రికార్డుల్లో ఏడు గనుల వద్ద బొగ్గు స్టాక్ ఉన్నట్టు పేర్కొన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అది కనిపించకపోవడం ఈ కుంభకోణాన్ని తేటతెల్లం చేస్తోంది. 40 లక్షల టన్నుల బొగ్గు మీద కోల్ సెస్ తోపాటు, ఇన్ కమ్ టాక్స్ కూడా కట్టామని లెక్కలు చూపిస్తున్నా, క్షేత్రస్థాయిలో బొగ్గు లేకపోవడం వెనక ఎవరి హస్తం ఉందో తేలాల్సిన అవసరం ఉంది. కేంద్రమంత్రి వర్గంలో తెలంగాణ నుంచి ప్రాతినిథ్యం వహించడమే కాకండా సాక్షాత్తూ బొగ్గు గనుల శాఖ చూస్తున్న మీ హయాంలో ఇంత దుర్మార్గమైన కుంభకోణం జరగడం సిగ్గుచేటు. ఏప్రిల్ నెలాఖరు నాటికి మందమర్రిలో 7,20,00 మెట్రిక్ టన్నులు, శ్రీరాంపూర్ లో 8 లక్షల మెట్రిక్ టన్నులు, రామగుండం-1 లో ఆరు లక్షలు, రామగుండం-2 లో నాలుగు లక్షలు, భూపాలపల్లిలో 5 లక్షల 40 వేలు, ఇల్లందులో 3 లక్షల 50 వేలు, సత్తుపల్లిలో 2 లక్షల మెట్రిక్ టన్నులతోపాటు ఇతర వాటిని కలిపి సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నుల స్టాక్ ఉందని లెక్కలు చూపించారు. కానీ కోల్ స్టాక్ పాయింట్ల దగ్గర ఆ బొగ్గు లేకపోవడమే ఈ కుంభకోణానికి అతిపెద్ద ఆధారం. ఏప్రిల్ నెలలోనే బొగ్గు గనులపై నిలువలను తనిఖీ చేసే బొగ్గు గనుల శాఖ అధికారుల బృందాలు రాకపోవడం… చివరికి కాగ్ అధికారులు కూడా ఇప్పటిదాకా తనిఖీలు చేపట్టకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తున్నది. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రం మరియు రాష్ట్రం కలిసి లక్షల టన్నుల తెలంగాణ బొగ్గును పక్కదారి పట్టించాయా అనే బలమైన అనుమానం కార్మికలోకాన్ని వెంటాడుతోంది. ఈ స్కాంను దాచిపెట్టే కుట్రలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఒక అఖిల పక్షాన్ని ఆయా గనుల వద్దకు పంపాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అప్పుడే సింగరేణిలో సాగుతున్న ఈ భారీ అక్రమాల పుట్ట బద్దలవుతుంది.

ఈ కుంభకోణమే కాకుండా, ఇటీవల బీఆర్ఎస్ వెలుగులోకి తెచ్చిన నైని బొగ్గు గని టెండర్ల స్కాం కూడా దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకలాంటి సింగరేణిని కబళించేందుకు సీఎం రేవంత్ హయాంలో సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే నిబంధన పెట్టి, కోరుకున్న వారికి టెండర్లు కట్టబెట్టే కుతంత్రాన్ని అమలుచేశారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుందని తేలినా ఇప్పటిదాకా దీనిపై మీరు చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. నైని కోల్ స్కామ్ ను బీఆర్ఎస్ బయటపెట్టగానే ఆగమేఘాల మీద టెండర్ల ప్రక్రియను రద్దుచేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు తప్ప టెండర్లలో అక్రమార్కుల భరతం పట్టే దిశగా ఒక్క అడుగు వేయలేదు. టెండర్ పోటీదారులను బెదిరించి, భయపెట్టి ప్రక్రియ నుంచి తప్పించే పన్నాగాలు సాగినా దీనికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేయలేదు. ఈ టెండర్ల అక్రమాలను నిగ్గు తేల్చడానికి కేంద్రం వేసిన కమిటీ ఇప్పటివరకూ ఏం తేల్చిందో కూడా పత్తాలేదు. నైని కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపి మూడురోజుల్లోనే నివేదిక ఇవ్వాలని ఆదేశించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు మొద్దునిద్ర పోతోందో సింగరేణి కార్మికులకు సమాధానం చెప్పండి. అసలు బొగ్గు ఉత్పత్తి కోసం కోల్ ఇండియా పాటించే విధానాలేంటి? కాంగ్రెస్ హయాంలో సైట్ విజిట్ సర్టిఫికేట్ ను ఎవరి ప్రయోజనాలు ఆశించి పెట్టారు? చివరికి కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులను ఎలా పక్కదారి పట్టించారు ? అనే అంశాలపై వాస్తవాలను బయటపెట్టకపోవడం కాంగ్రెస్ ముఖ్యమంత్రితో మీకున్న లోపాయికారి ఒప్పందాలను బట్టబయలు చేస్తోంది.

అలాగే గతంలో నైని స్కామ్ తోపాటు.. 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుల నిబంధనలకు పాతరేసి నేషనల్ ఆవరేజీని కూడా మించి అత్యధిక ధరలకు టెండర్లు కట్టబెట్టి అక్రమాలకు పాల్పడ్డారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి నేరుగా డీజిల్ కొనుగోలు చేసే విధానాన్ని అర్థాంతరంగా రద్దుచేసి అందులోనూ దోపిడీకి తెరలేపారు. అలాగే పేలుడు పదార్థాల కొనుగోళ్లలోనూ కోల్ ఇండియా కంటే 30 శాతం అధిక నిధులు చెల్లించి అనుయాయులకు కట్టబెట్టారు. అంతే కాకుండా చివరికి మెస్సీతో ముఖ్యమంత్రి ఫుట్ బాల్ మ్యాచ్ కోసం 110 కోట్ల సింగరేణి నిధులను దుర్వినియోగం చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇలా వరుస కుంభకోణాలు జరుగుతున్నా అక్రమార్కుల భరతం పట్టకుండా కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం వెనక కాంగ్రెస్-బీజేపీ చీకటి ఒప్పందాలే కారణమని కార్మికులకు అర్థమైపోయింది. సింగరేణిలో జరుగుతున్న అక్రమ దందాలను వెలుగులోకి తెచ్చేందుకు చివరికి ఆర్టీఐ కింద దరఖాస్తు చేసినా వివరాలు బయటకు పొక్కకుండా దుష్టశక్తులు అడ్డుకుంటున్న దుస్థితి నెలకొంది. కాంగ్రెస్ హయాంలో రెండున్నరేళ్లుగా వరుస కుంభకోణాలు జరుగుతున్నా మీరు బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పట్టించుకోకపోవడం పట్ల సింగరేణి కార్మికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.

Also Read:గ్రేట్ నికోబార్‌ను కాపాడుకుందాం!

సింగరేణి సంస్థలో పనిచేస్తున్న వేలాది మంది కార్మికుల పొట్టకొట్టి సంస్థను దెబ్బతీసే కాంగ్రెస్-బీజేపీల కుట్రలను బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ సహించదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ముఖ్యమంత్రితో మీకున్న రహస్య ఒప్పందాల కారణంగా సింగరేణి సంస్థను బలతీయవద్దని కోరుతున్నాం. ప్రస్తుతం బీఆర్ఎస్ వెలుగులోకి తెచ్చిన 1600 కోట్ల సింగరేణి బొగ్గు కుంభకోణంపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కార్మికుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. సింగరేణి సంస్థను కోలుకోని విధంగా దెబ్బతీసే ఈ కుంభకోణంపై ఒకవేళ మీరు విచారణ జరపకపోతే కార్మికలోకంతో కలిసి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్ఎస్ పార్టీ జంగ్ సైరన్ మోగిస్తుంది అన్నారు.

- Advertisement -