దేశంలో సాధారణ వ్యక్తికి సొంత కారు కలను నిజం చేయాలన్నది టాటా గ్రూప్ ప్రస్తుత ఛైర్మన్ రతన్ టాటా ఆశయం. అనుకున్నట్టుగానే అందుకు ప్రయత్నాలూ మొదలుపెట్టాడు. దాని ఫలితమే నానో కారు. 2008లో లక్ష రూపాయలకే కారును సొంతం చేసుకోండంటూ నానో కారును విడుదల చేసిన విషయం తెలిసిందే.
కానీ ఇప్పుడు రతన్ టాటా ప్లాన్ రివర్స్ అయింది. తాజాగా నానో కారు ఉత్పత్తిని టాటా మోటార్స్ కంపెనీ త్వరలో నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది. కారణం డీలర్ల నుంచి పెద్దగా ఆర్డర్లు లేకపోవడమే. గత మూడు నెలల్లో నానో కార్ల ఆర్డర్ల సంఖ్య విపరీతంగా తగ్గిపోయింది. ఆగస్టులో 180 యూనిట్ల కోసం ఆర్డర్ రాగా, అక్టోబర్ నాటికి ఆ సంఖ్య 57కి పడిపోయింది.
టాటా మోటార్స్ వారి ఇతర ఉత్పత్తులు టియాగో, టిగోర్, హెక్సా, నెక్సాన్ కార్లను ప్రచారం చేస్తూ నానో కారు గురించి టాటా మోటార్స్ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో వాటి డిమాండ్ తీవ్రంగా పడిపోయింది. మొత్తానికి రతన్ టాటా ఆశయం మొదట్లో విజయవంతమైనప్పటికీ, సంస్థ సరైన ప్రచారం చేయకపోవడంతో నిర్వీర్యమైందని డీలర్లు అభిప్రాయపడుతున్నారు.