‘మా’ వివాదం ముగిసింది..!

219
- Advertisement -

ఇటీవల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నిధుల దుర్వినియోగం జరిగిందంటు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, సెక్రటరీ నరేష్‌లు రెండు వర్గాలుగా విడిపోయి, ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో, సినీ పెద్దలు జ్యోక్యం చేసుకొని, ఈ వివాదానికి తెరదించారు. ఈ రెండు వర్గాలను మళ్లీ ఒకటిగా చేశారు. ‌’మా’కు సంబంధించిన నిధుల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, వివిధ కార్యక్రమాలకు సంబంధించి చేసుకున్న ఒప్పందం ప్రకారమే అన్నీ జరిగాయని ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.

‘మా’ వివాదం గురించి నిర్మాత సురేష్‌బాబు, మా అధ్యక్ష, కార్యదర్శులు శివాజీరాజా, నరేష్‌లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. శివాజీరాజా మాట్లాడుతూ.. చిన్న మనస్పర్థలు వచ్చిన మాట నిజమేనని, అన్ని వివరాలను కలెక్టివ్ కమిటీ ముందు ఉంచామని, ఎలాంటి అవకతవకలు జరగలేదని తేలిందని చెప్పారు. నరేష్ మాట్లాడుతూ.. ఏ సంస్థలోనైనా బేధాభిప్రాయాలు రావడం సహజమేనని, రాబోయే రోజుల్లో జరిగే ఈవెంట్స్ ని కలసికట్టుగా సక్సెస్ చేస్తామని తెలిపారు. గతం గత: అని చెప్పారు.

MAA Controversy

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ప్రతి సంస్థలో ఇలాంటి బేధాభిప్రాయాలు వస్తుంటాయని చెప్పారు. రెండు వర్గాలు ప్రెస్ మీట్ పెట్టి తప్పు చేశాయని అన్నారు. ఇకపై అన్ని విషయాలను సెలెక్టివ్ కమిటీనే చూసుకుంటుందని చెప్పారు. ‘మా’లో ఎలాంటి అవకతవకలు జరగలేదని సినీ పరిశ్రమ ఏర్పాటు చేసిన కలెక్టివ్ కమిటీ విచారణలో తేలిందని తెలిపారు. భవిష్యత్తులో మీడియాతో కలెక్టివ్ కమిటేనే మాట్లాడుతుందని చెప్పారు.

ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు మాట్లాడుతూ.. ‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌, ఫెడరేషన్‌, ఫిలిం ఛాంబర్‌, తెలుగు ఫిల్మ్‌ కౌన్సిల్‌ ఇలా అనేక విభాగాలు కలిసి ఉన్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై మాట్లాడేందుకు తెలుగు ఇండస్ట్రీ కలెక్టివ్‌ కమిటీని ఏర్పాటు చేశాం. సమస్య ఏదైనా ఇక నుంచి కలెక్టివ్‌ బాడీనే మాట్లాడుతుంది. ‘మా’కు సంబంధించిన డబ్బుల విషయంలో ఇటీవల చెలరేగిన వివాదాలు కూడా సద్దుమణిగాయి. నిధులన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి. ‘మా’కు ఎలాంటి నష్టం కలగలేదు’’ అని తెలిపారు.

- Advertisement -