రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు. తెలంగాణలో ఆంధ్రోళ్లను కొడుతున్నారని ఆరోపించిన పవన్ ఎవరిని కొట్టామో చెప్పగలరా? అని ప్రశ్నించారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన తలసాని పవన్ తన వ్యాఖ్యలతో రెండు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.
టీడీపీలో ఉన్న 80శాతం మంది నేతలకు హైదరాబాద్‌లో ఆస్తులున్నాయని, వారంతా ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యాపారాలు చేసుకోవడం లేదా? అని ప్రశ్నించారు. నిన్నటివరకు హైదరాబాద్‌లోనే ఉన్న పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
ఏపీకి జగన్ సీఎం కావడం ఖాయమని జోస్యం చెప్పిన తలసాని వైసీపీకి 125-130 అసెంబ్లీ, 18-23 ఎంపీ సీట్లు వస్తాయని జాతీయ సర్వేలన్నీ చెబుతున్నాయని తెలిపారు. ఏపీలో టీడీపీ,చంద్రబాబుని ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు.