తెలంగాణ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే మహంకాళి బోనాలను అంగరంగ వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సచివాలయంలో మంత్రి పద్మారావుతో కలిసి సమీక్ష నిర్వహించిన తలసాని జూలై 15న బోనాల జాతర ప్రారంభమవుతుందని జూలై 30న రంగంతో ముగుస్తాయని తెలిపారు.
ఈ ఏడాది అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తున్నామని చెప్పారు. కోటి రూపాయల ఖర్చుతో 3 కిలోల 80 గ్రామలు బంగారం వినియోగించనున్నట్లు తెలిపారు. బంగారు బోనం నమూనాను విడుదల చేశారు. ఉత్సవాల సందర్భంగా జంటనగరాల్లోని 145 ఆలయాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తలసాని తెలిపారు.
మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు తెలంగాణ నలువైపుల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు హాజరు కానున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి నిర్వహిస్తున్నారు.
ఏటా ఆషాఢ మాసంలో అమావాస్య తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం బోనాలు ప్రారంభం అవుతాయి. ఈ ఆషాఢంలో జూలై 13న అమావాస్య వస్తుండడంతో మొదటగా వచ్చే ఆదివారం నుంచి బోనాల జాతర మొదలుకానుంది. గోల్కొండ కోటలోని శ్రీ ఎల్లమ్మ(జగదాంభిక) ఆలయంలో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. శ్రీ జగదాంభిక దేవాలయంలో మొదటి పూజ జరిగిన తర్వాత తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని ఆలయాల్లో బోనాలు ప్రారంభం అవుతాయి. ఆషాడ మాసంలో చివరి రోజు తిరిగి గోల్కొండ కోటలోనే చివరి బోనం పూజ జరుగుతుంది. దీంతో ఉత్సవాలు ముగుస్తాయి.