ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న చారిత్రక కట్టడం తాజ్ మహల్. తన భార్య ముంతాజ్ గుర్తుగా షాజహాన్ కట్టించిన ప్రేమ మందిరమే ఈ తాజ్‌మహల్. అందుకే ఈ తాజ్ కి యమ క్రేజ్ ఉంది. అంతేకాదు ఆగ్రాలోని యమునా నది తీరాన కొలువైన ఈ అపురూప పాలరాతి కట్టడాన్ని చూడడానికి అనేక ప్రాంతాలనుండి పర్యాటకులు వస్తుంటారు.
అలా వచ్చిన వారందరూ..ఇప్పటి వరకూ తాజ్‌మహల్ ని చూసి, ఆ పాలరాతి కట్టడాన్ని తాకుతూ..మైమరచిపోయారు. కానీ ఇకనుంచి తాజ్ ని తాకడం కష్టమే. ఎందుకంటే… పర్యాటకులు తాజ్‌మహల్‌ను ముట్టకోకుండా త్వరలో దీని చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
గత కొన్నేళ్లుగా తాజ్‌మహల్ కాలుష్యానికి గురవుతూ తన కళను రోజు రోజుకీ కోల్పోతోంది. దీన్ని గమనించిన భారత ఆర్కియాలజీ సర్వే అధికారులు.. తాజ్‌మహల్‌ను కాలుష్యం బారి నుంచి కాపాడేందుకు ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేపట్టారు.
అందుకే సమయం ప్రకారం.. కట్టడానికి మడ్ థెరపీ కూడా చేస్తున్నారు. అయితే తాజ్‌ను చూసేందుకు వచ్చే పర్యాటకులు గోడలను ముట్టుకోవడం కూడా కాలుష్యానికి కారణమని ఇటీవలే గుర్తించారట.
అందుకే పర్యాటకులు తాకడానికి వీలు లేకుండా కట్టడం చుట్టూ మీటర్ దూరంలో బారికేడ్లు ఏర్పాటుచేసే యోచలో ఉంది ఆర్కియాలజీ విభాగం. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం లేదు. సో..తాజ్‌మహల్‌ని మీ చేతులతో తాకుతూ..క్రేజీగా ఫీలవ్వాలనుకుంటే మాత్రం, త్వరగా ఆగ్రాకి వెళ్ళాల్పిందే మరి.