కొత్త ఆలోచనలకు వేదికగా టీ హబ్ నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ సైబర్ సిటీ కన్వెన్షన్ సెంటర్‌లో టీహబ్ ప్రధమ వార్షికోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేటీఆర్ హాజరయ్యారు.ఐటీ రంగంలో తెలంగాణ యువత ఆలోచనలకు రెక్కలు తొడిగాయని పేర్కొన్నారు. ఉత్సాహవంతులైన యువతకు టీ హబ్ అండగా నిలిచిందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా హైదరాబాద్‌లో ఇంక్యుబేషన్ సెంటర్లు ఉన్నాయని తెలిపారు. త్వరలో టీ హబ్ రెండో దశను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.
ఆలోచనలను ఆచరణలోకి తెచ్చి సమస్యలకు పరిష్కారం కనుగొనాలని సూచించారు. అభివృద్ధికి వూతమిచ్చే రంగాలపై దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఐటీకి పెద్దపీట వేస్తూ….ఉద్యోగ,ఉపాధి రంగాలపై దృష్టిసారిస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, నాస్కామ్ ఛైర్మన్ మోహన్‌రెడ్డి, తదితరులు హాజరయ్యారు.