రేవంత్‌ రెడ్డిపై మరోసారి సీనియర్ల తిరుగుబాటు..!

63
Revanth Reddy
- Advertisement -

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిపై మరోసారి ఆ పార్టీలోని సీనియర్లు తిరుగుబాటు స్వరం పెంచారు. ఇప్పటికే రేవంత్‌రెడ్డిపై గుర్రుగా ఉన్న పార్టీ సీనియర్‌ నేతలు తమ అసంతృప్తిని కాంగ్రెస్‌ అధిష్టానం వద్ద వెళ్లగక్కారు. ఢిల్లీలో రాహుల్‌ గాంధీతో పలువురు నేతలు సమావేశమై రేవంత్‌రెడ్డి ఒంటెద్దు పోకడలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రేవంత్‌ ‘వన్‌మ్యాన్‌ షో’ చేస్తున్నాడని, పార్టీ నేతలెవరితో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటూ సీనియర్లను అవమానిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. ఆయన తీరుతో పలువురు కీలక నేతలు పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉన్నదని తెలిపారు. రేవంత్‌ సీనియర్లను లెక్కచేయకుండా పార్టీ అభ్యర్థులను ఏకపక్షంగా ప్రకటిస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అయితే ఈ సమావేశం నుంచి వెంకట్‌రెడ్డి మధ్యలోనే బయటకు వచ్చారు. మరోవైపు సీనియర్‌ నేత వీ హనుమంతరావు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై, రేవంత్‌రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు, సీనియర్లను లెక్కచేయకపోవడంపై ఆమెకు దాదాపు 30 నిమిషాలపాటు వివరించినట్టు తెలిసింది. దీంతో తెలంగాణ వర్గపోరు పంచాయతీ ఢిల్లీకి చేరింది. టీ- కాంగ్రెస్ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు.

పీసీసీ చీఫ్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయి, అధిష్ఠానికి పరస్పర ఫిర్యాదులు చేశారు. మరో వైపు వ్యూహకర్త సునీల్ కుమార్ రిపోర్ట్ కీలకంగా మారింది. తెలంగాణ ఎన్నికలకు ముందు పార్టీలో ఉత్సాహాన్ని నింపేందుకు టీపీసీసీ ప్రయత్నిస్తుంటే.. అంతర్గత ప్రజాస్వామ్యం కాస్త ఎక్కువగా వుండే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు తాడును మరోవైపు లాగేందుకు యత్నిస్తున్నారు. దానికి వారు చూపుతున్న కారణాలు సహేతుకంగా కనిపిస్తున్నా ఏమీ చేయలేని స్థితిలో అధిష్టానం వున్నట్లు తెలుస్తోంది. అందరినీ కలుపుకుని పోయే నేతకే పీసీసీ పగ్గాలివ్వాలని, వ్యక్తిగత షోల ద్వారా పార్టీకి విజయాన్ని సాధించలేమని రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారు చెబుతున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై వి. హనుమంతరావు సహా పార్టీలో కొందరు సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు. రేవంత్ రెడ్డి తీరును బహిరంగంగానే వి. హనుమంతరావు తప్పు బట్టారు.

అయితే ఇటీవల మంత్రి హరీష్ రావును వి. హనుమంతరావు కలవడాన్ని రేవంత్ రెడ్డి వర్గం తప్పుబడుతుంది. అయితే తన కూతురు డాక్టర్ కావడంతో బదిలీ విషయమై మంత్రి హరీష్ రావును వి.హనుమంతరావు కలిస్తే తప్పేం ఉందని జగ్గారెడ్డి వి. హనుమంతరావు తరపున వకాల్తా పుచ్చుకున్నారు. మొదటి నుండి పార్టీలో ఉన్నవారి విషయంలో రేవంత్ రెడ్డి వర్గం వ్యవహరిస్తున్న తీరును కూడా వి. హనుమంతరావు సోనియాకు వివరించే అవకాశం ఉంది. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఏ రకమైన వ్యూహాన్ని అనుసరించాలనే దానిపై కూడా హనుమంతరావు సోనియాతో చర్చించినట్లు తెలుస్తోంది. మొత్తానికి రేవంత్‌ రెడ్డిపై కాంగ్రెస్‌ పార్టీలోని సీనియర్‌ లీడర్లు అధిష్టానికి ఫిర్యాదు చేయడంతో రేవంత్‌ రెడ్డిపై అధిష్టానం ఓ కన్నేసి ఉంచిందనే వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా కాంగ్రెస్‌ పార్టీలో వర్గ విభేదాలతో ఆ పార్టీకి తీరని నష్టం చేకూరుతుందనేది జగమెరిగిన సత్యం.

- Advertisement -