సిరియా నరమేథం.. పాపం ఎవరిది?

215
Syria strikes
- Advertisement -

సిరియా అంతరుద్యం ఇప్పట్లో సమసిపోయేలా లేదు. రసాయన దాడులు జరిగిన తర్వాత తిరుగుబాటుదారులు లక్ష్యంగా అమెరికా సిరియాపై క్రూయిజ్ క్షిపణిలతో విరుచుకుపడింది. ఈ దాడిలో 9 మంది మృతిచెందారు. సెంట్రల్‌ సిరియాలోని ఎయిర్‌బేస్‌పై చేసిన దాడుల్లో ఆరుగురు సైనికులతో పాటు ముగ్గురు పౌరులు మృతి చెందినట్లు  సిరియా మీడియా వెల్లడించింది. ఇంకా అనేక మందికి గాయాలయ్యాయి. ప్రభుత్వ, పౌర ఆస్తులు పెద్దయెత్తున ధ్వంసమయ్యాయి.

Syria strikes

సిరియాలో బషర్‌ అల్‌ అసద్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ట్రంప్‌ ప్రభుత్వం నేరుగా జరిపిన తొలి దాడి ఇది. అమెరికన్‌ సామ్రాజ్యవాదుల ఈ దుందుడుకు చర్య అరబ్‌ ప్రపంచాన్ని ముఖ్యంగా పశ్చిమాసియాను తీవ్ర అనిశ్చితిలోకి నెట్టింది. అగ్ర రాజ్య దుర్మార్గపు చర్యను అణు సంపన్న రష్యా తీవ్రంగా ఖండించింది. ఇది సిరియా దేశ సార్వభౌమత్వంపై జరిగిన దురాక్రమణేనని రష్యా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

2011లో సిరియా యుద్ధం ప్రారంభమైన తర్వాత అమెరికా ప్రత్యక్షంగా ఇలా సైనిక చర్యకు దిగడం ఇదే మొదటిసారి. జనవరిలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి విదేశాంగ విధానానికి సంబంధించి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ట్రంప్‌, సిరియాపై ప్రత్యక్ష చర్యకు దిగుతూ చాలా కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. 70మందికి పైగా మృతికి దారి తీసిన రసాయన దాడులకు సిరియా సర్కార్‌దే బాధ్యత అని స్పష్టం చేసిన మరుసటి రోజే ట్రంప్‌ ఈ క్షిపణి దాడులకు ఆదేశించారు.

Syria strikes

రసాయన దాడులకు తమను బాధ్యులు చేస్తూ అమెరికా చేస్తున్న ఆరోపణలను సిరియా తోసిపుచ్చింది. రసాయన దాడులపై ఏ అంతర్జాతీయ దర్యాప్తుకైనా తాము సిద్ధమేనని సిరియా ప్రభుత్వం ప్రకటించింది. దర్యాప్తుకు అనుసరించాల్సిన విధి విధానాలను తామే నిర్దేశిస్తామని అసద్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే పలు దేశాలు అమెరికాకు అండగా నిలవగా రష్యా మాత్రం సిరియాను వెనకేసుకొచ్చింది. అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

తాజా దాడుల నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి అత్యవసర సమావేశం నిర్వహించింది. సిరియాలో విష వాయు దాడి జరిగిన తర్వాత కూడా ఐక్యరాజ్య సమితి చర్య తీసుకోవడంలో విఫలమైతే వ్యక్తిగతంగా దేశాలే చర్య తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ హెచ్చరించారు. విష దాడిని ఖండిస్తూ ముసాయిదా తీర్మానాన్ని రూపొందించాలని భద్రతా మండలి భావిస్తోంది. కానీ రష్యా దీన్ని వ్యతిరేకిస్తోంది. అసద్‌, రష్యా, ఇరాన్‌లకు శాంతి నెలకొల్పడంపై ఏమాత్రమూ ఆసక్తి లేదని హేలీ మండలిలో వ్యాఖ్యానించారు.

Syria strikes

సిరియా వైమానిక స్థావరంపై అమెరికా జరిపిన క్షిపణి దాడులు ఒక సార్వభౌమత్వ దేశంపై జరిపిన దురాక్రమణగానే తాము భావిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. అమెరికా క్షిపణి దాడులను తీవ్రంగా ఖండించిన రష్యా అధ్యక్షభవనం క్రెమ్లిన్‌ ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్‌ ఈ దాడులు ఉభయదేశాల సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని వ్యాఖ్యానించారు. సిరియాపై అమెరికా చేసిన దాడులు అంతర్జాతీయ చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా ఒక సార్వభౌమత్వ దేశంపై జరిపిన దురాక్రమణగా అధ్యక్షుడు పుతిన్‌ పరిగణిస్తున్నారని పెస్కోవ్‌ వివరించారు.

ఇరాక్‌, సిరియాలలో ఉగ్రవాదులు అమర్చిన ఆయుధాలు, మందుపాతర్లను పూర్తిగా వెలికి తీసేందుకు కనీసం 40-50 ఏళ్ల వ్యవధి పడుతుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.  రెండో ప్రపంచ యుద్ధానంతరం ఐరోపా దేశాలలో అమర్చిన మందుపాతరలు,మారణాయుధాలను వెలికి తీసేందుకు తాము దశాబ్దాల తరబడి కృషి చేశామని, అదే తరహాలో ఇప్పుడు ఇరాక్‌, సిరియాలలో వున్న మారణాయుధాలను వెలికి తీసేందుకు మరో నాలుగైదు దశాబ్దాలు పడుతుందని చెప్పారు.

- Advertisement -