దేశంలో కరోనా కేసులు రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని పొడగించింది కేంద్రం. పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని పొడగించిన కేంద్రం ఈ బ్యాన్‌ను ఏప్రిల్ 30వ తేదీ వరకు పెంచింది. ఈ మేరకు డీజీసీఏ డైరెక్టర్ జనరల్ సునీల్‌కుమార్ ప్రకటించారు.
కార్గో సర్వీసులకు నిషేధం వర్తించదని సునీల్‌కుమార్ స్పష్టం చేశారు. డీజీసీఏ ఎంపిక చేసిన దేశాలకు మాత్రం సర్వీసులు యథాతథంగా కొనసాగుతాయని తెలిపారు. గత సంవత్సరం కరోనా మహమ్మారి తొలిసారి విజృంభిస్తున్న సమయంలో మార్చి 23న అంతర్జాతీయ విమానా సర్వీసులపై భారత్ నిషేధం విధించగా ఆ తర్వాత నిషేధాన్ని పలుమార్లు కేంద్రం పొడిగిస్తూ వస్తోంది. ఎయిర్ బబుల్ కింద ఎంపిక చేసిన దేశాలకు గత జూలై నుంచి విమాన సర్వీసులను నడిపిస్తోంది. యూఎస్, యూకేతోపాటు 20 దేశాలకు ఈ సర్వీసులు కొనసాగుతున్నాయి.