బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ హఠాన్మరణం చెందారు. తీవ్ర అస్వస్థతకు గురైన సుష్మాను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించగా మంగళవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె వయసు 67 సంవత్సరాలు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. లాయర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనంతరం రాజకీయాల్లో చేరి, అనతికాలంలోనే దేశరాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
సుష్మా స్వరాజ్ 1952, ఫిబ్రవరి 14న హర్యానాలోని అంబాలా కంటోన్మెంటులో జన్మించారు. సుష్మాస్వరాజ్ విద్యార్థి సంఘం నాయకురాలిగా 1970లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఏడుసార్లు ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 1977లో తొలిసారిగా హర్యానా రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1996, 1998లో వాజ్‌పేయి మంత్రివర్గంలో పనిచేశారు.1998లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
2014 నుంచి 2019 మే వరకు మోడీ ప్రభుత్వంలో విదేశాంగశాఖ మంత్రిగా పనిచేశారు. సుష్మాస్వరాజ్‌కు భర్త, ఓ కూతురు ఉన్నారు. భర్త స్వరాజ్ కౌశల్ సుప్రీం సీనియర్ న్యాయవాది. స్వరాజ్ కౌశల్ 1990 నుంచి 1993 వరకు మిజోరాం గవర్నర్‌గా పనిచేశారు.సుష్మా స్వరాజ్ మృతితో బీజేపీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి.