‘ఈటి’ మూవీ రివ్యూ..

493
- Advertisement -

తమిళ హీరో సూర్య తాజాగా నటించిన చిత్రం‘ఈటి’.భారీ అంచనాలతో ఈ రోజు సినిమా థియేటర్లలో విడుదలైంది. సమకాలీన సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్ని చర్చిస్తూ ఈ సినిమాను రూపొందించామని ప్రచార కార్యక్రమాల సందర్భంగా చెప్పడం.. ట్రైలర్‌ సైతం సూర్య శైలి మాస్‌ అంశాలతో ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

దక్షిణాపురం అనే ఊరికి చెందిన యువ న్యాయవాదే కృష్ణమోహన్‌ (సూర్య). తొమ్మిదేళ్ల వయసులోనే తన చెల్లి కామాంధుల కర్కశత్వానికి బలై పోవడంతో.. మహిళలు అంటే గొప్ప గౌరవభావం కలిగి ఉండటంతో పాటు వారికి ఎలాంటి సమస్య వచ్చినా చలించిపోతాడు. ఇదిలావుండగా దక్షిణాపురం టౌన్‌లో కొందరమ్మాయిలు వరుసగా ఆత్మహత్యకు పాల్పడటం.. ప్రమాదాల్లో చనిపోవడం జరుగుతుంటుంది. ఈ సంఘటనల వెనకున్నది ఎవరు? వాటిని ఛేదించే క్రమంలో కృష్ణమోహన్‌ తెలుసుకున్న నిజాలేమిటి? ఈ కీచకపర్వాన్ని అంతమొందించడానికి యువ లాయర్‌ ఏ రీతిలో పోరాటం చేశాడు? ఎలాంటి వ్యూహాలు అమలు చేశాడు? అన్నదే మిగతా చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్:

సూర్య నటన ఆకట్టుకుంటుంది. తనలోని మాస్‌ యాంగిల్‌ను మరోసారి ఈ సినిమా ద్వారా రుజువు చేశారు. ప్రియాంక అరుళ్‌మోహన్‌కు మంచి పాత్ర దక్కింది. ఆమె అందంగా కనిపించడంతో పాటు క్లెమాక్స్‌ సన్నివేశాల్లో చక్కటి నటనతో మెప్పించింది. శరణ్య, సత్యరాజ్‌ తమ పాత్రల పరిధుల మేరకు న్యాయం చేశారు. వినయ్‌రాయ్‌ విలన్‌గా ఫర్వాలేదనిపించాడు.

మైనస్‌ పాంయిట్స్‌:

కథాకథనాలు అంత ఆసక్తికరంగా.. అర్థవంతంగా లేకపోవడం పెద్ద మైనస్ అయింది. ప్రేక్షకులను ఒక అలజడికి గురి చేస్తూ హడావుడిగా.. గందరగోళంగా సాగే కథనం ‘ఈటి’ నీరుగారిపోయేలా చేసింది. అటు విలన్.. ఇటు హీరో.. ఇద్దరి పాత్రలు ఆకట్టుకోలేకపోయాయి. కథకుడిగా, దర్శకుడిగా పాండిరాజ్‌ ఈ సినిమా విషయంలో పూర్తిగా విఫలమయ్యాడని చెప్పొచ్చు.

సాంకేతిక విభాగం:

సంగీతపరంగా పాటలు అంతంతమాత్రమే అనిపించినా.. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగా కుదిరింది. కొన్ని ఎలివేషన్‌ సీన్స్‌కు బీజీఎమ్‌ ఊపు తీసుకొచ్చింది. రత్నవేలు సినిమాటోగ్రఫీ బాగుంది. ఆరంభ సన్నివేశాల్లో గ్రామీణ సౌందర్యాన్ని గొప్పగా ఒడిసిపట్టింది.

తీర్పు: ‘ఈటి’.. యాక్షన్‌ ఘట్టాలు తప్ప అంతగా ఆకట్టుకునే అంశాలు లేవని చెప్పాలి.

విడుదల తేదీ:04/03/2022
రేటింగ్‌: 2.5
నటినటులు: సూర్య, ప్రియాంక అరుళ్‌మోహన్‌, సత్యరాజ్‌, శరణ్య, పొన్వణ్ణన్‌ తదితరులు
సంగీతం: డి. ఇమ్మాన్‌
నిర్మాత‌లు: సన్ పిక్చర్స్
దర్శకత్వం: పాండిరాజ్‌

- Advertisement -