పదవుల కోసం కాదు ప్రశ్నించడం కోసమే అంటూ గత ఎన్నికలకు దూరంగా ఉన్న పవన్ కల్యాణ్, వచ్చే ఎన్నికల్లో బరిలో దిగడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగా పార్టీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కార్యాలయ ప్రారంభోత్సవం కూడా చేశారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పవన్ కల్యాణ్ వెంట మరికొందరు సినీ ప్రముఖులు ఉండడం ఆసక్తిగా మారింది.
అయితే.. పవన్ పార్టీ కార్యాలయం ప్రారంభ కార్యక్రమానికి ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కూడా హాజరయ్యారు. దీంతో జనసేన పార్టీలో సురేష్ బాబు చేరనున్నారా? అనే అనుమానాలు మొదలవుతున్నాయి.
జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి అలీ, త్రివిక్రమ్, సత్యానంద్, ఎస్.రాధాకృష్ణ లాంటి పవన్ సన్నిహితులు వచ్చారు. కానీ సురేష్ ప్రొడక్షన్స్ అధినేత కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
సురేష్ ప్రొడక్షన్లో రూపొందిన గోపాల గోపాల సినిమాలో పవన్ వెంకటేష్‌తో కలిసి నటించారు. ఆ సమయంలో దగ్గుబాటి సురేష్‌తో కూడా ఆయనకు సాన్నిహిత్యం ఏర్పడింది. తర్వాత కూడా వీరి మధ్య స్నేహం కొనసాగుతోంది.
ఈ మైత్రి కారణంగానే సురేష్ బాబు పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్ ప్రారంభానికి వచ్చారా? లేదంటే జనసేన తరఫున పని చేయనున్నారా? అనే విషయంలో క్లారిటీ లేదు. కానీ..సురేష్ బాబు పవన్ పార్టీలో చేరనున్నారా ? అంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.