టెక్నాలజీ దిగ్గజం, వాట్సాప్ యజమాన సంస్థ అయిన మెటా కంపెనీకి సుప్రీంకోర్టు ఇవాళ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. వాట్సాప్ 2021 ప్రైవసీ పాలసీకి సంబంధించిన కేసులో జరిగిన విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశ పౌరుల గోప్యతతో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేసింది.
ఈ కేసు విచారణలో చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు. భారతదేశ ప్రైవసీతో మీరు ఆటలాడుకోలేరు. మా దేశానికి సంబంధించిన సింగిల్ డిజిట్ డేటాను కూడా షేర్ చేసుకునేందుకు మేము అనుమతించబోం. భారత చట్టాలను పాటించలేని పక్షంలో ఈ దేశాన్ని విడిచిపెట్టాల్సి ఉంటుంది అని మెటాకు స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు.
ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, యూజర్ల వ్యక్తిగత డేటాను కమర్షియల్ అవసరాల కోసం వాట్సాప్ వినియోగిస్తోందని ఆరోపించారు. పౌరుల గోప్యతకు ఇది తీవ్ర ముప్పుగా మారుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా కోర్టు మరో కీలక ప్రశ్న లేవనెత్తింది. “వాట్సాప్ ప్రైవసీ పాలసీ చదువుకున్న వారికే అర్థం కావడం కష్టం. అలాంటప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్య ప్రజలకు తమ గోప్యత ఎలా రక్షించబడుతోందో ఎలా అర్థమవుతుంది?” అని వ్యాఖ్యానించింది.
భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందేనని, పౌరుల ప్రైవసీని ఉల్లంఘించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
Also Read:శాశ్వత్ సచ్‌దేవ్..’ది ఇండియా హౌస్’

