దేశవ్యాప్తంగా ఉన్న న్యాయవ్యవస్థలో జాప్యానికి అడ్డుకట్ట వేసేలా భారత అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం సంచలన తీర్పును వెలువరించింది. ఏదైనా కేసులో వాదనలు పూర్తయిన తర్వాత తీర్పును రిజర్వ్ చేసినట్లయితే.. ఆ తేదీ నుండి 3 నెలల లోపు ఖచ్చితంగా తీర్పును వెల్లడించాల్సిందేనని దేశంలోని అన్ని హైకోర్టులను సుప్రీం కోర్టు ఆదేశించింది. తీర్పుల్లో ఆలస్యం వల్ల కక్షదారులు (లిటిగెంట్స్) కోలుకోలేని నష్టాన్ని మూటగట్టుకుంటున్నారని కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
జార్ఖండ్ హైకోర్టులో తీర్పుల వెల్లడిలో జరుగుతున్న ఆలస్యంపై దాఖలైన ఒక పిటిషన్‌ను విచారిస్తూ.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం తనకు ఉన్న అసాధారణ అధికారాలను ఉపయోగించి సుప్రీం కోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ సూర్య కాంత్ మరియు జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరిస్తూ పలు సంచలన మార్గదర్శకాలను ఇచ్చింది:
వ్యక్తిగత స్వేచ్ఛ కు సంబంధించిన కేసుల్లో అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ధర్మాసనం నొక్కి చెప్పింది. బెయిల్ దరఖాస్తులపై వాదనలు ముగిసిన అదే రోజు ఆర్డర్లను వెల్లడించాలి. ఒకవేళ ఏదైనా కారణం చేత ఆర్డర్‌ను రిజర్వ్ చేయాల్సి వస్తే, ఖచ్చితంగా మరుసటి రోజే తీర్పును ప్రకటించి, దానిని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. హైకోర్టులు తాము ఇచ్చే అన్ని రకాల తీర్పులను, అవి వెలువరించిన 24 గంటల లోపు అధికారిక వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేసింది.
బెయిల్ వచ్చినప్పటికీ పేపర్ వర్క్ ఆలస్యం కావడం వల్ల నిందితులు జైల్లోనే మగ్గిపోతుండటంపై కోర్టు స్పందించింది. బెయిల్ మంజూరైనా లేదా శిక్ష రద్దయినా ఆ ఉత్తర్వులను తక్షణమే జైలు అధికారులకు చేరవేయాలి. అవసరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేసి, బెయిల్ పొందిన విచారణ ఖైదీ లేదా దోషిని అదే రోజు లేదా అత్యంత గరిష్ఠంగా మరుసటి రోజు లోపు జైలు నుండి విడుదల చేయాలి అని సూచించింది.
రెగ్యులర్ బెయిల్ ఆర్డర్లపై కింది కోర్టులు కూడా తక్షణ సమాచారాన్ని అందించాలని ఆదేశించింది. తీర్పు యొక్క ప్రధాన భాగం ఏ రోజు అయితే కోర్టులో చదివి వినిపిస్తారో.. ఆ తేదీనే తీర్పు వెలువరించిన అధికారిక తేదీగా పరిగణిస్తారు. వేలాది మంది ప్రజలు న్యాయం కోసం ఆశ్రయించే ప్రాథమిక సంస్థలు హైకోర్టులని, అక్కడ సకాలంలో తీర్పులు రావడం ఎంతో అవసరమని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ మార్గదర్శకాలు ఏ న్యాయమూర్తిని లేదా వ్యవస్థను తక్కువ చేసి చూపించడానికి ఉద్దేశించినవి కావని, కేవలం న్యాయప్రక్రియను వేగవంతం చేయడానికేనని ధర్మాసనం స్పష్టం చేసింది.
Also Read:మోదీకి నచ్చిన..’పెద్ది’!

