అరావళి పర్వతాలపై వివాదం..సుప్రీం సుమోటో

10
- Advertisement -

అరావళి పర్వత శ్రేణిపై కొనసాగుతున్న వివాదాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. మైనింగ్ తవ్వకాల వల్ల తీవ్ర పర్యావరణ విధ్వంసం చోటుచేసుకునే ప్రమాదం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే అత్యంత పురాతన పర్వత శ్రేణుల్లో ఒకటైన అరావళి పర్వతాలు, భూగర్భ జలాల సంరక్షణ, వాతావరణ సమతుల్యత, జీవ వైవిధ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అలాంటి పర్వతాల్లో అక్రమ మైనింగ్ కార్యకలాపాలు పెరుగుతుండటంపై పర్యావరణవేత్తలు, పౌర సంఘాలు ఎన్నో రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఈ వ్యవహారాన్ని డిసెంబర్ 29న సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ విచారించనుంది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఏజీ మసీహ్‌లతో కూడిన బెంచ్ ఈ అంశంపై కీలక వాదనలు విననుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అరావళి పర్వతాల్లో మైనింగ్ తవ్వకాలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఆ నిషేధం క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలవుతోందన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

ఢిల్లీ నుంచి గుజరాత్ వరకు విస్తరించి ఉన్న అరావళి పర్వత శ్రేణిని అక్రమ మైనింగ్ నుంచి పూర్తిగా కాపాడాలనే లక్ష్యంతో కేంద్రం పలు చర్యలు చేపడుతోంది. సుప్రీంకోర్టు జోక్యం నేపథ్యంలో ఈ అంశంపై మరింత కఠిన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ విచారణ పర్యావరణ పరిరక్షణ దిశగా ఒక కీలక మైలురాయిగా నిలవనుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.

Also Read:అంతర్జాతీయ ఇన్నోవేషన్ సమ్మిట్‌కు కేటీఆర్‌

- Advertisement -