తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. “మీకిదే చివరి అవకాశం ఇస్తున్నాం. స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా? లేక మేమే నిర్ణయం తీసుకోవాలా?” అంటూ ధర్మాసనం స్పష్టమైన హెచ్చరిక చేసింది. ఫిరాయింపులపై దాఖలైన అనర్హత పిటిషన్లను ఇప్పటివరకు పెండింగ్‌లో ఉంచడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
స్పీకర్‌గా ఉన్న వ్యక్తి రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఉందని, అయితే ఆ బాధ్యతను విస్మరిస్తే న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి వస్తుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తెలంగాణలో ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంలో అనవసర జాప్యం జరుగుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫిరాయింపులు తీవ్రమైన అంశమని, వాటిపై స్పష్టమైన నిర్ణయం తప్పనిసరని పేర్కొంది.
ఈ నేపథ్యంలో, రెండు వారాల లోపల ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై స్పీకర్ తీసుకున్న చర్యలకు సంబంధించిన పూర్తి వివరాలతో అఫిడవిట్‌ను సమర్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలు, భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత ఇవ్వాలని సూచించింది.
అంతేకాకుండా, ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌కు సంబంధించిన కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. నిర్ణీత గడువు లోపు స్పష్టమైన చర్యలు లేకపోతే తాము తగిన నిర్ణయం తీసుకుంటామని కోర్టు హెచ్చరించడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read:‘కనుమ’..ఎందుకు జరుపుకుంటారు?

