దివంగత పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ కుటుంబంలో జరుగుతున్న ₹30,000 కోట్ల భారీ ఆస్తి పోరాటాన్ని సుప్రీంకోర్టు ‘మహాభారతం’తో పోల్చింది. ఈ వివాదం తీవ్రతను చూస్తుంటే, కోర్టు ముందున్న ఈ గొడవతో పోలిస్తే ఆ పురాణ యుద్ధం కూడా “చాలా చిన్నదిగా అనిపిస్తుంది” అని జస్టిస్ జె.బి. పార్దివాలా సంచలన వ్యాఖ్యలు చేశారు.
సంజయ్ కపూర్ తల్లి రాణి కపూర్ దాఖలు చేసిన తాజా పిటిషన్‌ను విచారిస్తున్న సందర్భంగా జస్టిస్ పార్దివాలా నేతృత్వంలోని బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. “మేము ఒక పెద్ద రణరంగంలోకి ప్రవేశించాము. దీని ముందు మహాభారతం కూడా చాలా చిన్నదిగా కనిపిస్తుంది. మేము దీనిని పరిశీలిస్తాము” అని ఆయన పేర్కొన్నారు.
సోనా గ్రూప్ వ్యవస్థాపకుడు సురీందర్ కపూర్ కుమారుడైన సంజయ్ కపూర్ గత ఏడాది మరణించారు. ఆయన మరణానంతరం ఆయన ఆస్తుల కోసం తల్లి రాణి కపూర్, మూడవ భార్య ప్రియా సచ్‌దేవ్ కపూర్, మరియు మాజీ భార్య కరిష్మా కపూర్ పిల్లల మధ్య వివాదం మొదలైంది.
తన ప్రమేయం లేకుండా, ఫోర్జరీ పత్రాలతో ‘ఆర్.కె. ఫ్యామిలీ ట్రస్ట్’ను సృష్టించి ఆస్తులను మళ్లించారని రాణి కపూర్ ఆరోపిస్తున్నారు. మధ్యవర్తిత్వ ప్రక్రియ జరుగుతున్న సమయంలో మే 18న జరగాల్సిన బోర్డు సమావేశాన్ని నిలిపివేయాలని ఆమె కోర్టును కోరారు.ఈ సంక్లిష్టమైన కుటుంబ వివాదాన్ని పరిష్కరించడానికి మే 7న సుప్రీంకోర్టు, మాజీ ప్రధాన న్యాయమూర్తి (CJI) డి.వై. చంద్రచూడ్‌ను మధ్యవర్తిగా నియమించింది.
ఇది ఒక కుటుంబ వివాదమని, దీనిని వినోదంగా మార్చవద్దని, సోషల్ మీడియాలో దీనిపై చర్చలు పెట్టవద్దని కోర్టు అన్ని పక్షాలకు సూచించింది. సంజయ్ కపూర్ 2025 జూన్‌లో ఇంగ్లాండ్‌లో పోలో మ్యాచ్ ఆడుతూ గుండెపోటుతో మరణించారు. అప్పటి నుండి సుమారు ₹30,000 కోట్ల విలువైన ఆస్తి కోసం కుటుంబ సభ్యుల మధ్య న్యాయపోరాటం సాగుతోంది. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు మే 14కు వాయిదా వేసింది.
Also Read:NEET UG 2026 రద్దు..CBI విచారణ

