గుర్తు పెట్టుకో..కాలం ప్రతీది తిరిగిస్తుంది!

2
- Advertisement -

వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో అధికారులు ఏర్పాటు చేసిన ఒక వినూత్న బ్యానర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ ఆలోచింపజేస్తోంది. సమాజంలో మారుతున్న మానవ సంబంధాలు, కనుమరుగవుతున్న నైతిక విలువలపై ఈ బ్యానర్ గట్టి సందేశాన్ని ఇస్తోంది.

ఈ రోజు నీ తల్లిదండ్రులను ఎలా చూస్తావో.. రేపు నీ పిల్లలు నిన్ను అలానే చూస్తారు. గుర్తు పెట్టుకో.. కాలం ప్రతీది తిరిగిస్తుంది…వరంగల్ కలెక్టరేట్ గోడపై కనిపిస్తున్న ఈ అక్షరాలు చదివిన ప్రతి ఒక్కరినీ ఒక్క క్షణం నిలదీస్తున్నాయి.

సాధారణంగా కలెక్టరేట్‌కు వచ్చే ఫిర్యాదులు భూతగాదాలు, పెన్షన్లు లేదా ఇతర పౌర సమస్యలపై ఉంటాయి. కానీ, ఇటీవల వరంగల్ కలెక్టరేట్‌లో జరుగుతున్న ‘ప్రజావాణి’ (గ్రీవెన్స్ డే) కార్యక్రమానికి వస్తున్న ఫిర్యాదుల్లో అత్యధికం వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల నుండే వస్తున్నాయి. తమ సొంత పిల్లలే తమను పట్టించుకోవడం లేదని, తిండి పెట్టకుండా వేధిస్తున్నారని, ఆస్తులు రాయించుకుని రోడ్డుపై వదిలేస్తున్నారని వృద్ధులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

ప్రజావాణిలో బాధితుల గోడు వింటున్న అధికారులకు, ఇది కేవలం చట్టపరమైన సమస్య మాత్రమే కాదని, మానసిక మరియు సామాజిక విలువల పతనం అని అర్థమైంది. కేవలం కేసులు నమోదు చేయడం వల్ల పూర్తి మార్పు రాదని భావించిన అధికారులు, కన్నవారిని గౌరవించాల్సిన బాధ్యతను యువతకు గుర్తు చేసేందుకు ఈ అవగాహన బ్యానర్‌ను ఏర్పాటు చేశారు.

Also Read;‘గాంధీ బజార్’లో బాబిల్ ఖాన్

కలెక్టరేట్‌కు వచ్చే సందర్శకులు ఈ బ్యానర్‌ను చూసి అధికారుల చొరవను అభినందిస్తున్నారు. చట్టాలు ఎన్ని ఉన్నా, కన్నప్రేమను మర్చిపోతున్న ఈ కాలంలో ఇటువంటి హెచ్చరికలు చాలా అవసరం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -