పిల్లలకు ఇంటర్నెట్..ప్రాథమిక హక్కే

9
- Advertisement -

ఇంటర్నెట్‌ను వినియోగించుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ప్రాథమిక హక్కేనని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిల్లల వయసుతో సంబంధం లేకుండా వారికి కూడా ఈ హక్కు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌లో పిల్లల భద్రతను కాపాడాలనే ఉద్దేశంతో వారికి ఇంటర్నెట్‌ను పూర్తిగా దూరం చేయడం సరైన పరిష్కారం కాదని అభిప్రాయపడింది. పిల్లల స్వేచ్ఛను కాపాడుతూనే వారి భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కే. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21తో పాటు ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం ఇంటర్నెట్‌ను పొందడం, వినియోగించడం ప్రాథమిక హక్కుగా గుర్తించింది. ఇంటర్నెట్ ద్వారా సమాచారం తెలుసుకోవడం, విద్యను అభ్యసించడం, భావాలను వ్యక్తపరచడం వంటి అవకాశాలు లభిస్తాయని పేర్కొంది.

పిల్లలు ఆన్‌లైన్‌లో ఎదుర్కొంటున్న ప్రమాదాల నేపథ్యంలో వారి ఇంటర్నెట్, సోషల్ మీడియా వినియోగంపై పరిమితులు విధించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అయితే పిల్లలను ఇంటర్నెట్‌కు పూర్తిగా దూరం చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నిషేధాలు విధించినంత మాత్రాన పిల్లలు ఇంటర్నెట్ వినియోగాన్ని పూర్తిగా ఆపివేయరని, నియంత్రణ లేని ఇతర వెబ్‌సైట్లు, ప్లాట్‌ఫామ్‌లకు వెళ్లే ప్రమాదం ఉందని పేర్కొంది.

Also Read:కత్తి ఆంధ్రావాడిది..కానీ పొడిచేది తెలంగాణోడు

ఆన్‌లైన్‌లో పిల్లలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడేవారిని, అభ్యంతరకరమైన కంటెంట్‌ను సృష్టించి వ్యాప్తి చేసేవారిని నియంత్రించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. తప్పు చేసే వారిపై చర్యలు తీసుకోకుండా, బాధితులైన పిల్లలకే ఇంటర్నెట్‌ను నిరాకరించడం సరైన విధానం కాదని పేర్కొంది.

సోషల్ మీడియా, ఇతర ఆన్‌లైన్ వేదికల ద్వారా పిల్లలపై లైంగిక దోపిడీ, వేధింపులకు సంబంధించిన కంటెంట్ వ్యాప్తిని అరికట్టే అంశాన్ని విచారిస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

- Advertisement -