తృణమూల్ రెబెల్ ఎంపీలకు నోటీసులు

1
- Advertisement -

పార్టీని వీడి రెబెల్‌గా మారి స్పీకర్ ఓం బిర్లా వద్ద పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ బెనర్జీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.టిఎంసికి చెందిన 20 మంది ఎంపీలు పార్టీ మారడమే కాకుండా, ఎన్‌సిపిఐ (NCPI) పార్టీలో విలీనమై ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించారు.

పార్టీని వీడి ఎన్డీఏలో చేరేందుకు గుర్తింపు లేని చిన్న పార్టీ అయిన ఎన్‌సిపిఐలో విలీనమైన 20 మంది రెబెల్ తృణమూల్ ఎంపీలకు సుప్రీంకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది.తృణమూల్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, లోక్‌సభ పక్ష నేత అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఈ నోటీసులు ఇచ్చింది. రెబెల్ ఎంపీలపై పార్టీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా త్వరితగతిన నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని బెనర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం. పంచోలీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించి నోటీసులు జారీ చేసింది.ఆరంభంలో స్పీకర్‌కు కూడా నోటీసు జారీ చేస్తామని కోర్టు పేర్కొన్నప్పటికీ, స్పీకర్ తరఫున కోర్టులో హాజరైన సొలిసిటర్ జనరల్ (SG) తుషార్ మెహతా అభ్యర్థన మేరకు ఆ నిర్ణయాన్ని విరమించుకుంది.

స్పీకర్ తరఫున తానే హాజరవుతున్నానని తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా, అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఇప్పటికే నోటీసులు జారీ చేశారని తనకు స్పష్టమైన సమాచారం ఉందని పేర్కొన్నారు.ఎస్‌జి వ్యాఖ్యలపై స్పందించిన జస్టిస్ బాగ్చి, “కేవలం నోటీసులు ఇవ్వడం మాత్రమే ముఖ్యం కాదు; ఒక నిర్దిష్ట సమయ పరిమితిలో విచారణ ప్రక్రియను ముగించడమే ఇక్కడ అసలు ప్రశ్న” అని వ్యాఖ్యానించారు.ఎంపీలపై ప్రారంభమైన అనర్హత విచారణను పూర్తి చేయడంలో జరుగుతున్న ఆలస్యాన్ని సవాలు చేస్తూ బెనర్జీ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.

Also Read:హిజాబ్‌పై హైకోర్టు కీలక తీర్పు

కోర్టు విచారణపై అభిషేక్ బెనర్జీ తరఫు న్యాయవాది కల్యాణ్ బెనర్జీ స్పందిస్తూ.. ఇది తృణమూల్ కాంగ్రెస్‌కు వచ్చిన పెద్ద విజయమని, కోర్టు త్వరలోనే స్పష్టమైన తేదీని నిర్ణయిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీలోని 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటు చేసి, త్రిపురకు చెందిన నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (NCPI) అనే ప్రాంతీయ పార్టీలో చేరినట్లు లేదా విలీనమైనట్లు ప్రకటించి, సభలో తమకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని కోరడంతో ఈ వివాదం మొదలైంది.

- Advertisement -