కేంద్ర ఎన్నికల సంఘం (ECI)లో ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అయితే జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేయాలని కోరిన అభ్యర్థనపై ప్రస్తుతం ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు కోర్టు నిరాకరించింది.
ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. ఎన్నికల సంఘంలోని మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లతో ఏకాభిప్రాయం లేకుండానే సీఈసీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలను పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ ఆరోపణలపై స్పందించాలని కోరుతూ సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం తమ వైఖరిని, సంబంధిత నిర్ణయాల ప్రక్రియకు సంబంధించిన వివరాలను కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది.
విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సంఘం నుంచి సమాధానం అందిన తర్వాత.. కొన్ని నిర్ణయాలు అవసరమైన ఏకాభిప్రాయం లేకుండానే తీసుకున్నట్లు తేలితే, వాటిని తిరిగి పరిశీలించే అవకాశం ఉందని కోర్టు సంకేతాలు ఇచ్చింది.
నోటీసు ఇచ్చిన తర్వాత వారు వచ్చి.. కొన్ని నిర్ణయాలు ఏకాభిప్రాయం లేకుండా తీసుకున్నామని చూపిస్తే, ఆ నిర్ణయాలను మేము వెనక్కి తీసుకుంటాం అని ధర్మాసనం పేర్కొంది. అయితే ప్రస్తుతం సీఈసీపై ఎలాంటి మధ్యంతర చర్య తీసుకోబోమని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం సమాధానం, అందులోని వివరాలను పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Also Read:మహిళల భద్రతపై సుప్రీం ఆగ్రహం
ఈ కేసులో సుప్రీంకోర్టు తదుపరి విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం సమర్పించే సమాధానం కీలకంగా మారనుంది. ముఖ్యంగా సీఈసీ నిర్ణయాలు ఎన్నికల కమిషనర్ల మధ్య అవసరమైన ఏకాభిప్రాయంతోనే తీసుకున్నారా లేదా అనే అంశంపై కోర్టు దృష్టి సారించే అవకాశం ఉంది.

